తొక్కిసలాటలో 29మంది దుర్మరణం
మొనొర్వియా : లైబీరియాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చి వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్‌క్రాస్, విపత్తు బృందాలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు.