మొత్తం విస్తీర్ణం 18304 ఎకరాలు
మొదటిదశలో 9212 ఎకరాలు అందుబాటులోకి
జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు
ఏటా రూ. 58 వేల కోట్ల ఎగుమతులు
5.60 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
టీఎస్‌ఐఐసీకి ఇప్పటికే 500 ల ఫార్మా సంస్థలు, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ దరఖాస్తు
పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ ఫీల్డ్ ఫార్మాసిటీ కోసం జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్లు
ఫార్మాసిటీని నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ [నిమ్జ్] గా గుర్తించిన కేంద్రం
హైదరాబాద్: ఫార్మాసిటీ ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం 10 వేల ఎకరాలను సేకరించింది. మిగిలిన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికే పూర్తయింది. కాగా వ్యర్థాల నిర్వహణ ప్లాంట కోసం ఆసక్తివ్యక్తీకరణ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 500 కంపెనీలు ఇందుకోసం ఆసక్తి చూపుతున్నాయి. ఫార్మాసిటీ ప్రారంభమైతే భారీ పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున దొరుకుతాయని ప్రభుత్వ భావన.
మెడికల్ హబ్ గా ఉన్న హైదరాబాద్ త్వరలో ఫార్మాహబ్ గా కూడా అవతరించబోతోంది. ప్రపంచపటం మీద ఉనికిని చాటే విధంగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అతిపెద్ద ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తోంది. దశలవారీగా మొత్తం 18 వేలా 304 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీని తేవడం ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం టీఎస్ఐఐసీ 10 వేల ఎకరాలను ఇప్పటికే సేకరించింది. మరో రెండు నుంచి మూడు వేల ఎకరాల వ్యవహారం కోర్టులో ఉంది. త్వరలోనే అన్ని ఆటంకాలు తొలగి ఔషధానగరి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఇప్పటివరకు సేకరించిన భూమిలో మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్ దీపాలు ఏర్పాటు పూర్తైంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది. నీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ప్లాంట్లపై ఆధారపడనున్నారు.
పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ ఫీల్డ్ ఫార్మాసిటీ కోసం టీఎస్ఐఐసీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండేలా మల్టిపుల్ వేస్టేజ్ నిర్వహణా ప్లాంట్లను నెలకొల్పుతోంది. ఇందుకోసం వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. 120 ఎంఎల్డీ సామర్థ్యంతో 5 జోన్లలో 5 ప్లాంట్లను నిర్మించనుంది. ఈ ప్రతిపాదనల కోసం వినతులు స్వీకరించే గడువు జనవరి నెలాఖరుతో ముగియనుంది. ఫార్మాసిటీకి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ తోపాటు అన్నిరకాల ఇతర అనుమతులు కూడా వచ్చాయి. ఫార్మాసిటీని కేంద్రప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ [నిమ్జ్] గా గుర్తించింది. నిమ్జ్ మార్గదర్శకాల ప్రకారం ఫార్మాసిటీ అభివృద్ధి, విస్తరణ, మౌలిక సదుపాయాల కోసం రూ. 5 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు పంపింది. ఇదే విషయంపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.
ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం హౌజ్ సైట్స్ ఇవ్వనుంది. ఒక ఎకరానికి 120 గజాల చొప్పున ఇంటిస్థలాలు కేటాయించనుంది. నిర్వాసిత కుటుంబాల యువతకు ఉచితంగా ఉపాధిశిక్షణ కూడా ఇస్తోంది. ఔషధనగరిలో వాళ్లకు ఉపాధి దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఫార్మాసిటీలో పరిశ్రమలతోపాటు పరిశోధనలకు తగిన ప్రాధాన్యం ఉండనుంది. ఇక్కడ ఒక ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశలో సంప్రదింపులు జరుగుతున్నాయి. ముచ్చర్ల ఫార్మసిటీలో స్థలాల కోసం ఇప్పటికే 500 ల ఫార్మా సంస్థలు, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ టీఎస్‌ఐఐసీకి దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఆయా సంస్థల డీపీఆర్లను పరిశీలించి కంపెనీల అవసరాలకు అనుగుణంగా అర ఎకరం మొదలు ఎకరం నుంచి పది ఎకరాలకు పైగా కూడా టీఎస్ఐఐసీ భూములు ఇవ్వనుంది. ఒక్క మొదటి దశలోనే దాదాపు 6 నుంచి 7 వేల ఎకరాల మేరకు కేటాయింపులు జరగవచ్చని అంచనా.
అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ఫార్మాసిటీని అందుబాటులోకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేస్తోంది. ఔషధ, పరిశోధనా సంస్థల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎకోసిస్టంను ఔషధనగరిలో ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. నిమ్జ్ లో రూ. 60 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని, ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా ఎగుమతులకు ఆస్కారం ఉంటుందనేది సర్కారు అంచనా. ఫార్మాసిటీ మొదలైతే ప్రత్యక్షంగా 6 లక్షల మందికి, పరోక్షంగా మరింత పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు రానున్నాయి.
మెట్టపల్లి శ్రీనివాస్