ఐఐటి భువనేశ్వర్ పరిశోధకుల రూపకల్పన
న్యూఢిల్లీ : ఎలెక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త టెక్నాలజీని ఐఐటి పరిశోధకులు రూపొందించారు. దీనివల్ల ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆన్‌బోర్డు ఛార్జర్ టెక్నాలజీకి అయ్యే వ్యయం కన్నా సగానికి సగం తగ్గుతుంది. అంతేకాదు టూవీలర్ , ఫోర్‌వీలర్ వాహనాల రేట్లు కూడా తగ్గే అవకాశం కలుగుతుంది. ఐఐటి గువాహటి, ఐఐటి భువనేశ్వర్ సహకారంతో వారణాసి లోని ఐఐటిభువనేశ్వర్ పరిశోధకులు ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండడం సామాన్యులకు తలకు మించిన భారమౌతుండడంతో ఇంధన వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఎలెక్ట్రికల్ వాహనాల వినియోగం తప్పనిసరి అవుతోంది.
అయితే ఇప్పుడున్న ఆన్ బోర్డు ఛార్జర్ టెక్నాలజీ కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఈ నేపథ్యంలో ఎలెక్ట్రికల్ వాహన యజమాని అవుట్‌లెట్ ద్వారా తమ వాహనాలను ఛార్జింగ్ చేసుకోవచ్చు. కానీ ఇది కూడా ఎలెక్ట్రిక్ వాహనాల ధరలు మరింత ప్రియం కావడానికి దోహదం చేస్తాయి. ఇప్పుడు ప్రతిపాదించిన ఆన్‌బోర్టు టెక్నాలజీలో అదనపు పవర్ ఎలెక్ట్రానిక్స్‌ను తగ్గించారు. ఈమేరకు కావలసిన భాగాలు 50 శాతం వరకు తగ్గాయి. ఫలితంగా ప్రతిపాదించిన ఛార్జర్ మామూలు ఛార్జర్‌గా తిరిగి రూపొందించడమైందని ఐఐటి భువనేశ్వర్‌కు చెందిన చీఫ్ ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్ రాజీవ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ కొత్త టెక్నాలజీ వైపు దేశం లోని ప్రముఖ ఎలెక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కూడా మొగ్గు చూపుతోంది.