న్యూఢిల్లీ: విపత్తుల నిర్వహణలో అద్భుతమైన సేవలందించినందుకు గాను 2022 సంవత్సరానికి గాను సుభాష్ చంద్ర బోస్ అపదా ప్రబంధన్ పురస్కారం కోసం గుజరాత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్( జిఐడిఎం), సిక్కిం రాష్ట్ర ప్కృతి విపత్తుల నిర్వహణ అథారిటీ వైస్ చైర్మన్ వినోద్ శర్మను ఎంపిక చేశారు. సంస్థాగత కేటిగిరీలో జిఎండిఎంను ఎంపిక చేయగా, శర్మను వ్యక్తిగత కేటగిరీలో ఎంపిక చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్‌లో విపత్తుల నిర్వహణలో అమూల్యమైన, నిస్వార్థ సేవలను అందించిన వ్యక్తులను, సంస్థలను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా నేతాజీ జయంతి అయిన జనవరి 23న ఈ అవార్డును ప్రకటిస్తారు. ఈ అవార్డు కింద సంస్థకయితే రూ.51లక్షలు, వ్యక్తికయితే రూ.5లక్షల నగదుతో పాటుగా సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ ఏడాది ఈ అవార్డు కోసం గత ఏడాది జులై 1నుంచి ఆహ్వానించగా, వ్యక్తులు, సంస్థలనుంచి మొత్తం 243 నామినేషన్లు వచ్చినట్లు ఆ ప్రకటన తెలిపింది.
2012లో ఏర్పాటయిన జిఐడిఎం అప్పటినుంచి గుజరాత్‌లో ప్రకృతి విపత్తుల రిస్క్(డిఆర్‌ఆర్) సామర్థాన్ని పెంచడానికి కృషి చేస్తోంది. దీనికి సంబంధించిన వివిధ అంశాల్లో 12,000 మంది ప్రొఫెషనల్స్‌కు ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. ఇక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో సీనియర్ ప్రొఫెసర్, సిక్కిం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ వైస్ చైర్మన్ అయిన శర్మ ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా పిలవబడే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫౌండర్ కోఆర్డినేటర్‌గా పని చేశారు. ప్రకృతి విపత్తుల ముప్పును తగ్గించడాన్ని ( డిఆర్‌ఆర్) జాతీయ అజెండాలో ప్రధానమైనదిగా తీసుకు రావడానికి ఆయన నిర్విరామంగా కృషి చేశారు. ఇది ఆయనకు అంతర్జాతీయ గుర్తింపును సైతం తీసుకు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం జరిగే ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, 2019, 2020, 2021 సంవత్సరాల పురస్కార గ్రహీతలతో పాటుగా వీరికి ఈ అవార్డును అందజేస్తారని ఆ ప్రకటన తెలిపింది.