హైదరాబాద్: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆడ పిల్లల చదువులు ఆగిపోవద్దనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ లక్ష్య సాధనలో మనమంతా భాగమై బాలికలకు డిజిటల్ విద్య అందించి, వారి గొప్పతనాన్ని వెలికితీసి ప్రపంచానికి చాటడంలో పూర్తి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో బాలురకు సమానంగా..ఇంకా ఎక్కువగా బాలికల విద్యకు, విద్యా సంస్థలలో డిజిటల్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కోవిడ్ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ఆడపిల్లల చదువులు ఆగిపోకూడదని, విలేజ్ లెర్నింగ్ ప్రోగ్రాం కింద ఉపాధ్యాయులు విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠాలు చెప్పే విధంగా, వారి సందేహాలు తీర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల విద్య ఆగిపోకూడదనే గొప్ప సంకల్పంతో 53 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రారంభించి, నడిపిస్తున్నారన్నారు. అవసరమైతే మరిన్ని పెంచేందుకు, ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం కెసిఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, బాలికలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు పనిచేయకుండా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు ప్రతి నెల 2000 రూపాయల చొప్పున ఇస్తోందని, బాలిక పుడితే ప్రత్యేకంగా మరో 1000 రూపాయలు అదనంగా కలిపి 13000 రూపాయలు ఇస్తుందన్నారు. బాలికల రక్షణ, అవసరం, వారి విద్యకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కోసం ఎప్పటికప్పుడు టివిలు, రేడియోలు, అవుట్ డోర్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తూ అవగాహన కల్పిస్తున్నామని సత్యవతి రాథోడ్ అన్నారు.
గ్రామ సభలు, మండల స్థాయిలో మహిళా సభలు నిర్వహిస్తూ భ్రూణ హత్యల నివారణ, బాలికల రక్షణ, విద్యపై తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నామన్నారు. నిరుపేద, అనాథ బాలికల జన్మదినోత్సవాలను నిర్వహిస్తూ వారికి సమాజం పట్ల నమ్మకం కల్పించే చర్యలు చేపడుతున్నామన్నారు. అనాథలకు ఈ ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉండి సంరక్షణ చేసే విధంగా, వారికి కుటుంబం ఏర్పాటు చేసే విధంగా త్వరలో సమగ్ర చట్టం తీసుకొచ్చే కృషి జరుగుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఇస్తున్న ప్రాధాన్యత, వారి కోసం చేస్తున్న కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో బాలురు, బాలికల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యిందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఆడపిల్లల రక్షణ, సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వీరి పట్ల దాడులు చేసిన వారిపట్ల, అమానుషంగా వ్యవహరించిన వారిపట్ల కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.