గట్టెక్కిన సిట్సిపాస్, మెద్వెదెవ్, క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్, కనెపి
మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సోమవారం కూడా సంచలన ఫలితాలు నమోదయ్యాయి. టైటిల్ ఫేవరెట్లుగా భావించిన రెండో సీడ్ అరినా సబలెంకా (బెలారస్), 14వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టారు. అయితే ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అన్ సీడెడ్‌లు కయా కనెపి (ఇస్టోనియా), అలిజె కార్నెట్ (ఫ్రాన్స్)లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో రెండో డానిల్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీక్), 11వ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), తొమ్మిదో సీడ్ ఫెలిక్స్ అగర్ (కెనడా)లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మెద్వెదెవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 62,76, 67, 75 తేడాతో మాక్సిమ్ క్రెజి (అమెరికా)ను ఓడించాడు. ఇక సిట్సిపాస్ ఐదు సెట్ల హోరాహోరీ సమరంలో 46, 64, 46,63, 64తో ఫ్రిట్జ్ (అమెరికా)పై విజయం సాధించి ముందంజ వేశాడు. ఇతర పోటీల్లో అగర్, సిన్నర్‌లు విజయం సాధించారు.
కనెపి సంచలనం..
మహిళల సింగిల్స్ అన్ సీడెడ్ కనెపి సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం హోరాహోరీగా సాగిన పోరులో కనెపి 57, 62, 76తో సబలెంకాను ఓడించింది. మరో పోటీలో కార్నెట్ 64, 66, 64తో హలెప్‌ను ఓడించింది. ఇతర పోటీల్లో స్వియాటెక్, డానిల్లి కొలిన్స్ (అమెరికా) విజయం సాధించి ముందంజ వేశారు.