Saturday, December 21, 2024

రాత్రి కర్ఫ్యూ లేనట్టే!

- Advertisement -
- Advertisement -

There will be no night curfew in Telangana

కరోనా పాజిటివిటీ రేటు 10% దాటితేనే ఆంక్షలు అవసరం
హైకోర్టుకు వివరించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత కరోనా తీవ్రత లేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డిహెచ్) శ్రీనివాసరావు హైకోర్టుకు వివరించారు. కోవిడ్ పరిస్థితులపై మంగళవారం హైకోర్టు విచారణ నేపథ్యంలో నివేదిక సమర్పించారు. పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫూ అవసరమని డిహెచ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం  ఉందని వెల్లడించారు. ఒక్క జిల్లాలోనూ 10 శాతం మించలేదని వివరించారు. ఐసియూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందన్న వైద్యారోగ్యశాఖ ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు విధించినట్లు డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడ్రోజుల్లోనే లక్షణాలున్న 1 లక్షా 78 వేల మందికి కిట్లు పంపిణీ చేశామని చెప్పారు.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. 18 ఏళ్లలోపు వారిలో 59 శాతం మందికి టీకాలు ఇచ్చామని డిహెచ్ వివరించారు. రాష్ట్రంలో 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు పూర్తైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోన పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు.

దీంతో మాస్కులు, భౌతిక దూరం కనిపించడం లేదని కరోన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోందని పిటిషనర్లు వాదించారు. 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న కరోనా కిట్‌లో పిల్లలకు అవసరమైన మందులు లేవని న్యాయస్థానానికి వివరించారు. కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటోందని ఎజి హైకోర్టుకు తెలిపారు. మాస్కుల ధారణ, భౌతికదూరం పాటించడం అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిహెచ్‌ఎంసి, పోలీసులు కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని చెప్పింది. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డిహెచ్ హాజరు కావాలని ఆదేశించింది. కరోనా పరిస్థితిపై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News