ఐరాస వేదికగా పాక్ దారుణాలను ఎండగట్టిన భారత్
న్యూఢిల్లీ : 2008 లోజరిగిన ముంబై ఉగ్రదాడుల నిందితులను పాకిస్థాన్ ఇంకా పోషిస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉగ్రదాడులకు సంబంధించి ఆయా ఉగ్రవాదులకు ఏదో ఒక రూపంలో మూలాలు పాక్ లోనే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది చాలక ఆ దేశం భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఐరాస వేదికను దురినియోగం చేస్తోందని మండి పడింది. ఐక్యరాజ్యసమితి లోని పాకిస్థాన్ దౌత్యప్రతినిధి మునీర్ అక్రమ్ భద్రతా మండలిలో సాయుధ పోరాటంలో పౌరుల రక్షణ అనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తినప్పుడు భారత్ పాకిస్థాన్ పై విరుచుకుపడింది. ప్రస్తుతం మనం పౌరుల రక్షణపై చర్చిస్తున్నాం. ఇప్పుడు వారికి ఉగ్రవాదుల నుంచి ముప్పు వస్తోంది.
2008 లో ముంబైలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడికి సంబంధించిన నిందితులకు పాక్ మద్దతు లభిస్తూనే ఉందని భారత్ ధ్వజమెత్తింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం అందించడం, చురుకుగా మద్దతు ఇవ్వడంలో పాక్ చరిత్ర సృష్టించిందన్న సంగతి సభ్య దేశాలకు బాగా విదితమేనని ఐక్యరాజ్యసమితి లోని భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఆర్. మధు నిలదీశారు. అందువల్ల ప్రపంచంలో ఈనాడు జరుగుతున్న ఉగ్రదాడుల మూలాలు ఏదో ఒక రూపంలో పాక్‌లో ఉన్నాయని ఆయన ప్రకటించారు. జమ్ము కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ జమ్ముకశ్మీర్, లడఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, మరోసారి స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలు కూడా తమదేశంలో భాగమేనని వాటిని వెంటనే ఖాళీ చేయాలని భారత్ తేల్చిచెప్పింది. తాము పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు కోరుకుంటామని, గతంలో జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి కట్టుబడి ఉన్నామని భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది.