అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తెర లేచి ఓటు పోరు హోరాహోరీగా సాగుతున్న దశలో, బరిలోని పార్టీలు ఓటర్లకు పలు రకాల ఉచితాలను వాగ్దానం చేసి ఖజానాలను గుల్లచేసే సంప్రదాయంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ధర్మాసనం ఈ విషయంపై అభిప్రాయం తెలియజేయవలసిందని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఓటర్లకు కలర్ టివిలు, లాప్ టాప్‌లు, గ్యాస్ స్టవ్‌లు వంటివి ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేయడం ద్వారా కొన్ని బలమైన పార్టీలు, అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు ఖజానాపై భారం పెంచి అప్పుల ఊబిలోకి తోసేస్తున్నాయని, అదే సమయంలో పోటీలోని పార్టీల మధ్య సమస్థితిని ఈ ఉచితాలు హరిస్తున్నాయని, ఇలాంటి వాగ్దానాలు చేస్తున్న పార్టీల గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో చేయగలిగేది ఏమీ లేదని, ముందు ముందు జరగబోయే ఎన్నికలపై ప్రభావం చూపేలా చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడినట్టు వార్తలు చెబుతున్నాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాల్లోని పార్టీలు కూడా ఖజానాపై అమిత భారం చూపేలా ఉచితాలను వాగ్దానం చేస్తున్నాయని ఇది అనైతికమని తక్షణమే అరికట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రకరకాల ఉచితాలను ఎన్నికల ప్రణాళికలలో చేర్చడం నుంచి మినహాయింపుగా ఉన్న పార్టీ ఒక్కటి కూడా లేదు. బిజెపి కూడా ఎటువంటి మురికి అంటని సరికొత్త బంగారమేమీ కాదు. ఈ ఉచితాల ఉరవడిని ఆపడానికి ఇంతవరకూ తగిన చట్టం లేకపోడం గమనించవలసిన అంశం. కేంద్రంలోని ఏ ఒక్క ప్రభుత్వమైనా తలచుకొంటే పార్లమెంటు ఆమోదంతో చట్టం రాకుండా పోయేది కాదు. ఉచితాలు అనే ఆలోచనకు కొంత ప్రత్యేకత ఉంది. ప్రజలు నిరుపేదరికంలో ఉన్నప్పుడే, సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన జనం అత్యధిక సంఖ్యలో కుప్పలు తెప్పలుగా ఉన్న చోటనే ఉచిత సంతర్పణల అవసరం కలుగుతుంది. పేదలకు ఆహారం, వస్త్రాలు వంటివి దానం చేయడమనే పద్ధతి నుంచి వచ్చి పడిందే ఇది. అయితే వారిని సోమరులను చేసే రీతిలో అతిగా ఉచితాలు పంపిణీ చేయడం వేరు. వారి సామాజిక, ఆర్ధిక అణగారిన తనాన్ని తొలగించడం కోసం ఉద్దేశించే ఉచితాలు వేరు. ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలను రూపొందించాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెబుతున్నాయని, రాజకీయ పార్టీలు అటువంటి సంక్షేమ పథకాలను తమ మేనిఫెస్టోలలో వాగ్దానం చేయడంలో తప్పులేదని అయితే అవి ఎన్నికల ప్రక్రియ పవిత్రతను దెబ్బతీసే రీతిలో, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేటప్పుడు అనవసరమైన ఒత్తిడికి గురి చేసేలా వుండకూడదని ఎన్నికల సంఘమే ఒక దశలో అన్నది. సాగునీటి వసతిలేని చోట వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్తును వాగ్దానం చేయడం మిగతా ఉచితాల గాట గట్టదగినదికాదు. అది అసంఖ్యాకంగా ఉండే నిరుపేద రైతుల వ్యవసాయ ఉత్పాదకతను పెంచి వారి బతుకులను బాగు చేస్తుంది. ఆ సమాజ అభ్యున్నతిలో ప్రతిబింబిస్తుంది. అలాగే అణగారి, అంచులకు నెట్టి వేయబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల వంటివి కల్పిస్తామనడమూ ఇలాంటిదే. పేదలకు కలర్ టివి ఇవ్వడం వల్ల వారిలో విజ్ఞానం పెరుగుతుందని, రెండు బర్నర్ల గ్యాస్ స్టవ్, గ్రయిండర్ ఇవ్వడం వల్ల పొగ పొయ్యిలతో ఆరోగ్యం దెబ్బతినే స్థితి వారికి తప్పుతుందని, శ్రమ ఆదా అవుతుందని తమిళనాడులోని డిఎంకె పార్టీ నేతలు వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. పేదల జీవన స్థితి మెరుగుపరిచే ఉచితాలకు ఈ విధమైన ప్రత్యేకత ఉంటుంది. అలా కాకుండా ప్రజలందరూ సొంత డబ్బుతో బతికేలా చూడాలిగాని, ఉచితాలివ్వడం సరికాదనడం మన వంటి దేశాల్లో వాదనకు నిలబడదు. అమెరికాలో ఫుడ్ స్టాంప్స్ ఇవ్వడం లాంటిదే ఇక్కడ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో ఉచితాలు వాగ్దానం చేయడం అనే వాదననూ త్రోసిపుచ్చలేము. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ మహిళల గృహశ్రమకు వెల కట్టి ఇస్తామని వాగ్దానం చేసింది. డిఎంకె గృహిణులకు ప్రతి నెల రూ.1000 ఇస్తానన్నది. అప్పటి అధికారపక్షం అఖిల భారత అన్నాడిఎంకె వారికి నెలకు రూ.1500 ఆశ జూపింది. కాని ప్రజలు డిఎంకెనే ఎన్నుకొన్నారు. ప్రజలు విశ్వసనీయత జనహిత లక్షణం ఏ పార్టీలో వున్నాయో దానికి ఓటు వేస్తారు గాని గుడ్డిగా ఉచితాల వెంటపడి ఓటు దుర్వినియోగానికి పాల్పడరు. అయితే పార్టీలు పోటీపడి ఏదిపడితే అది ఉచితంగా ఇస్తామనడాన్ని అరికట్టాలి.
SC issues notice to Centre on freebies in Elections