Monday, December 23, 2024

మృత్యుంజయుడు

- Advertisement -
- Advertisement -
Kerala Man In UAE Recovers From Covid-19
దుబాయిలో ఆరు నెలల పాటు కొవిడ్‌తో
పోరాడి కోలుకున్న కేరళ ఫ్రంట్‌లైన్ వారియర్
ఆస్పత్రిలో అయిదు నెలల పాటు ఎక్మో మిషన్‌పైనే ఉన్న విజయ్ కుమార్

దుబాయి: మన దేశానికి చెందిన ఫ్రంట్‌లైన్ వారియర్ ఒకరు యుఎఇలో కొవిడ్ కారణంగా దాదాపుగా మృత్యువు అంచుదాకా వెళ్లాక తిరిగి కోలుకుని మృత్యుజయుడిగా నిలిచిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అరుణ్ కుమార్ నాయర్ అనే ఈ ఫ్రంట్‌లైన్ వర్కర్ కొవిడ్‌తో ఆరు నెలల పాటు జరిపిన పోరాటంలో దాదాపు అయిదున్నర నెలల పాటు కృత్రిమ ఊపిరితిత్తి(ఎక్మో మిషన్)పైనే గడిపారు. ఆరు నెలల తర్వాత కోలుకున్న అతడిని గురువారం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఆరు నెలల కాలంలో కార్డియాక్ అరెస్టుతో పాటుగా అనేక ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు కూడా. కేరళకు చెందిన 37 ఏళ్ల అరుణ్ కుమార్ అబూధాబిలోని ఎల్‌ఎల్‌హెచ్ ఆస్పత్రిలో కొవిడ్19 టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా పని చేస్తున్న సమయంలో 2021 జూలై మధ్యలో కరోనా సోకింది. 2013నుంచి కూడా ఆయన అదే ఆస్పత్రిలో ఒటి టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారణ కాగానే ఆయనను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

అయితే కొద్ది రోజులకే ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆయనను ఆస్పత్రికి మార్చి అన్ని పరీక్షలు జరపగా ఆయన ఊపిరి తిత్తులు బాగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. గత ఏడాది జులై 31న డాక్టర్లు ఆయనను ఎక్మో సపోర్ట్‌పై ఉంచారు. దాదాపు 118 రోజుల తర్వాత ఆయన ఎక్మో సపోర్ట్‌నుంచి బైటపడ్డారు. మొదట్లో అరుణ్ చికిత్సకు బాగానే స్పందించారు. అయితే రానురాను ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆయన తన అనారోగ్యం గురించి భారత్‌లో ఉన్న తన కుటుంబానికి తెలియజేయలేదు. డ్యూటీలో ఏర్పాట్ల కారణంగా తాను ఫోన్ చేయలేకపోతున్నానని మాత్రమే తెలియజేశారు. ‘ మొదట్లో మాకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ఆస్పత్రినుంచి కాల్ వచ్చినప్పుడు నమ్మలేకపోయాం’ అని రవీంద్ర భార్య జెన్నీ జార్జి చెప్పింది.

ఆమె కూడా హెల్త్ వర్కర్‌గా పని చేస్తోంది. భర్త వద్ద ఉండడం కోసం వీసా తీసుకుని ఆమె అబూధాబి వచ్చింది. వచ్చే ఆగస్టులో గృహప్రవేశం కోసం తన భర్త భారత్ రావాలనుకున్నారని, ఈ వార్త ఆయన తల్లిదండ్రులకు, తనకు శరాఘాతమే అయిందని ఆమె చెప్పారు. మొదటి రోజునుంచి కూడా అరుణ్ పరిస్థితి విషమంగానే ఉండిందని ఆయనకు మొదటినుంచి చికిత్స చేసిన బుర్జీల్ ఆస్పత్రిలో కార్డియాక్ సర్జరీ విభాగం హెడ్ అయిన డాక్టర్ తరిగ్ అలీ మహ్మద్ ఎల్హాస్సన్ చెప్పారు. కాగా తనకు ఏమీ గుర్తు లేదని, మృత్యువు కోరల్లోంచి బయటపడ్డానని మాత్రమే తనకు తెలుసునని అరుణ్‌కుమార్ చెప్పారు. అయిదు నెలల పాటు ఐసియులో ఉన్న ఆయన నెల రోజుల క్రితమే జనరల్ రూమ్‌కు మారారు. ఆయన త్వరలో తన తల్లిదండ్రులను కలుసుకోవడం కోసం భారత్ వెళ్తారని, అక్కడే తన ఫిజియో థెరపీని కొనసాగిస్తారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా దేశానికి అందించిన సేవలను, ఆయన పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ విపిఎస్ హెల్త్‌కేర్ అనే బహుళజాతి సంస్థ రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించింది. అంతేకాదు, ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు వారి బిడ్డ చదువు ఖర్చులు భరించడానికి ముందుకు వచ్చింది. గురువారం బుర్జీల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎమిరేట్స్‌లోని నాయర్ తోటి ఉద్యోగులుఆయనకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News