Friday, December 27, 2024

ఇక బహిరంగ మార్కెట్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్

- Advertisement -
- Advertisement -
Covaxin and Covishield in the open market
షరతులతో అనుమతి ఇచ్చిన డిసిజిఐ
ప్రస్తుతానికి ఆస్పత్రులు, క్లినిక్‌లలోనే లభ్యం

న్యూఢిల్లీ: కొవిడ్ నివారణకు మన దేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, కొవీషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అవసరమైన సాధారణ అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ(డిసిజిఐ)మంజూరు చేసింది. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాల విక్రయానికి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019 కింద రెగ్యులర్ మార్కెట్లో విక్రయానికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ సమాచారం, ప్రొగ్రమాటిక్ సెట్టింగ్ కోసం సరఫరా చేసిన టీకాల సమాచారాన్ని ఆయా సంస్థలు తెలియజేయాల్సి ఉంటుందని తెలిపపారు. ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రతి ఆరు నెలలకోసారి సేఫ్టీ డేటాను అందజేయాలని డిసిజిఐ నిపుణుల కమిటీ సూచించింది. అయితే ఈ రెండు వాక్సిన్లు అన్ని దుకాణాల్లో అందుబాటులోకి రావని, ప్రజలు వీటిని ఆస్పత్రులు, క్లినిక్స్‌లనుంచి మాత్రమే పొందగలుగుతారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ టీకాలు ఎప్పటినుంచి అందుబాటులోకి ఉంటాయనే అంశంపై పూర్తి సమాచారం రావలసి ఉంది. అయితే గత ఏడాది అక్టోబర్ 25న కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ బహిరంగ మార్కెట్లో విక్రయించుకునేందుకు అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్‌జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ)కి దరఖాస్తు చేసుకుంది. కొన్ని వారాలు క్రితం భారత్ బయోటెక్ కూడా తమ టీకా కొవాగ్జిన్‌కు ఇదే తరహా అనుమతి ఇవ్వాలని కోరుతూ సంబంధిత పత్రాలను డిసిజిఐకి సమర్పించింది.

ఈ నెల 19న కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని కొవిడ్19 నిపుణుల కమిటీ కూడా ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించింది. షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. మరో వైపు వీటి ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఒక్కో డోసు ధరను రూ.275కు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా సర్వీస్ చార్జి కింద మరో రూ.150 చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవాగ్జిన్ డోసు ధర రూ.1200 ఉండగా, కొవిషీల్డ్ ధర రూ.780గా ఉంది. దీనికి రూ.150 సర్వీస్ చార్జి అదనం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News