ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సంగీత రంగంలో స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసి ఈ రంగంలో సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకురావాలని ఆయన కోరారు. భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ 92వ జయంతి సందర్భంగా పండిట్ జస్రాజ్ సాంస్కృతిక ఫౌండేషన్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ ఆన్‌లైన్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ప్రపంచ సంగీతంలో సాంకేతిక విప్లవం ప్రవేశించిందని అన్నారు. పండిట్ జస్రాజ్ ఫౌండేషన్ రెండు అంశాలపై దృష్టిని నిమగ్నం చేయాలని, ప్రపంచీకరణ అంటే అది కేవలం ఆర్థిక రంగానికి సంబంధించినది మాత్రమే అన్న దృక్పథాన్ని మార్చడంతోపాటు ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మనిషి జీవితంలో సాంకేతికత ప్రభావం చూపుతోందని, సంగీత రంగంలో కూడా సాకేతిక విప్లవం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మార్పులు తీసుకురావాలని ఆయన అన్నారు.