మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం జలాలతో సేద్యం చేసి.. అందులో కొంత డబ్బును సిఎం సహాయనిధికి ఓ రైతు అందజేసి ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్‌రెడ్డి యువ రైతు. దశాబ్దాలుగా బీడుగా మారిన తన వ్యవసాయ భూమిని ఏడాది కాలంగా కాళేశ్వర జలాల సాయంతో పంటలు పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. తాను పండించిన పంటలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని ఆయన భావించారు. అందులో భాగంగా కొంత మొత్తాన్ని ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’కి అందజేయాలని నిర్ణయించుకున్నాడు. ఏడాదిలో తాను పండించే రెండు పంటల నుంచి వచ్చిన ఆదాయాన్ని ‘పంటకు పది వేల రూపాయల” చొప్పున ఆరునెల్లకోసారి సిఎం సహాయనిధికి జమ చేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తాను తెచ్చిన 10 వేల రూపాయలను అందజేశారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో పాటు విద్యుత్, అనుబంధ రంగాల అభివృద్ధితో.. తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషంగా ఉంది.వాణిజ్య పంటలను వినూత్నరీతిలో పండిస్తూ నికరాదాయన్ని గడిస్తున్నారు. ఏదో సంస్థలో అర కొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితి నుంచి వారు బయట పడుతుడడం ఆహ్వానించదగ్గ పరిణామం. స్వగ్రామాల్లోనే పచ్చని పంటపొలాల నడుమ ప్రకృతితో భాగమై ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని తమ సొంత కాళ్ల మీద నిలబడడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి తన సంపాదన నుంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. సిఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు సాయం చేసేందుకు తన పంటలో కొంతభాగాన్ని కేటాయించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి.అతనికి నా అభినందనలు..’ అని కెసిఆర్ వెల్లడించారు.