ఇంటి నిర్మాణానికి సాయం
తెలంగాణ కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యకు సిఎం కెసిఆర్ సత్కారం
మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటిని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య శుక్రవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సిఎం కెసిఆర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యను ఈ సందర్భంగా సిఎం అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మొగిలియ్య కు నివాసయోగ్యమైన ఇంటిస్థలం తో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రకటించారు.
ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సిఎం ఆదేశించారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. మొగిలయ్య వెంట మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆల్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.