ఖమ్మం: ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య కోరగానే వంద పడకల ఆస్పత్రిని సిఎం కెసిఆర్ మంజూరు చేశారని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మధిరలో నిన్న వంద పడకల ఆస్పత్రిని శంకుస్థాపన చేశామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో షిరిడి సాయి జన మంగళం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన హాస్పటల్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రూ 1.25 కోట్లతో సత్తుపల్లిలో టి డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రూ.1.78 కోట్లతో రేడియాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కల్లూరు, పెనుబల్లి ఆస్పత్రుల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యంపై సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. కెసిఆర్ కిట్ తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 52 శాతానికి ప్రసవాలు పెరిగాయని హరీష్ రావు కొనియాడారు.