న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జోకులేస్తున్నారా ? అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రశ్నించారు. సైకిల్‌కు పంక్చర్ అయినా బీజేపీ పైనే ఆరోపణలు చేస్తారన్నారు. యాదవ్ శుక్రవారం ట్విటర్ వేదికగా బీజేపీ పై చేసిన ఆరోపణలపై నఖ్వీ శనివారం ఘాటుగా స్పందించారు. అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్‌లో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. ఆయన హెలికాఫ్టర్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇవ్వలేదు. దీనిపై అఖిలేశ్ తన హెలికాప్టర్ బయల్దేరడానికి ముందు ఓ బీజేపీ నేత ప్రయాణించే హెలికాప్టర్‌కు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.
బీజేపీ నైరాశ్యంలో ఉందని, తన హెలికాప్టర్‌ను ఆపడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ముజఫర్ నగర్ చేరుకున్న తరువాత అఖిలేశ్ తాము ఆర్‌ఎల్‌డీ కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అఖిలేశ్ ఆరోపణలపై ఢిల్లీ విమానాశ్రయం అధికారి స్పందిస్తూ ఎయిర్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండడం, అఖిలేశ్ హెలికాప్టర్‌లో తగినంత ఇంధనం లేకపోవడం తదితర కారణాల వల్ల వెంటనే అనుమతి కుదరలేదని, ఇంధనం నింపిన తరువాత హెలికాప్టర్‌కు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో నఖ్వీ శనివారం అఖిలేశ్ యాదవ్ జోకులేస్తున్నారా ? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సమాజ్ వాదీ పార్టీ అంటే నేరగాళ్ల పార్టీ అని, ఇలాంటి నేరగాళ్ల మద్దతుతో ప్రజా సంక్షేమానికి పాటుపడతామని ఆ పార్టీ హామీలిస్తోందని ధ్వజమెత్తారు.