థాణె: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త ఒకరు దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి రోజువారీగా జరుగుతుందని మహారాష్ట్రలోని థానె జిల్లాలోని స్థానిక కోర్టు శనివారం తెలిపింది. ఈ మేరకు భివాండిలోని సివిల్ కోర్డు జడ్జి, జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్(జెఎంఎఫ్‌సి) జెవి పాలివాల్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను త్వరితంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను ఉటింకిస్తూ రాహుల్ గాంధీపై దాఖలైన కేసు ఈ కోవకే వస్తుందని, ఈ కారణంగా ఈ కేసును సత్వరమే, రోజువారీ పద్ధతిలో విచారించనున్నామని జడ్జి తెలిపారు. రోజువారీ విచారణకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. గతంలో థాణె జిల్లాలోని భివాండి పట్టణంలో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ హత్య వెనుక సంఘ్ పాత్ర ఉందని ఆరోపించగా దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ స్థానిక కార్యకర్త రాజేష్ కుంతే 2014లో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2018లో థాణె కోర్టు రాహుల్‌పై చార్జిషీట్ నమోదు చేసింది. కాగా..తనపై దాఖలైన ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చుతూ తాను నిర్దోషినని కోర్టుకు తెలిపారు.