అఖిలేష్ పాలనపై మోడీ ఆరోపణాస్త్రాలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం వరకు కండబలం ఉన్నవాళ్లు, అల్లరిమూకలు రాజ్యమేలాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. యుపిలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన అనంతరం మొదటిసారి వర్చువల్ పద్ధతిలో సోమవారం ఎన్నికల ప్రచార ర్యాలీనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ సమాజ్‌వాది పార్టీపై ఆరోపణాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో పశ్చిమ యుపి అల్లర్ల కారణంగా తగలబడుతుంటే అధికారంలో ఉన్న వారు సంబరాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల క్రితం దబాంగ్(కండబలం ఉన్నవాళ్లు), దంగల్ (విధ్వంసకారులు) చట్టాన్ని తమ చుట్టం చేసుకున్నారని, వారు చెప్పిందే వేదంగా ప్రభుత్వం పాటించిందని ఆయన ఆరోపించారు. ఆ రోజుల్లో వ్యాపారులను దోపిడీచేశారని, ఆడపిల్లలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు కూడా కాదని ప్రధాని అన్నారు. తమ సొంత దేశంలో తయారైన కొవిడ్ వ్యాక్సిన్ పట్ల నమ్మకం లేని వాళ్లు, వదంతులు రాజేసేవాళ్లు ఉత్తర్ ప్రదేశ్ యువతలోని ప్రతిభను ఎలా గౌరవించగలరని ఆయన ప్రశ్నించారు.