యువత డ్రగ్స్‌వైపు మళ్లకుండా అవగాహన
సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : గంజాయి రహిత జిల్లాగా మార్చడమే మనందరి ముందున్న ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై పోలీస్ కమిషనర్ జిల్లా పోలీస్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వాడకాన్ని సమూలంగా నిర్మూలించేందుకు హోంగార్డు నుంచి పైస్థాయి అధికారి వరకు కష్టపడాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మాదక ద్రవ్యాలను కట్టడి చేయకుంటే భవిష్యత్తులో సమాజంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.
గంజాయి నియంత్రణ తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నియంత్రించే సామజిక బాధ్యతగా తీసుకునేలా క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి తన స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు గంజాయి కేసులు నమోదు కాలేదని అలసత్వం ప్రదర్శించ కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి రవాణా, సాగుకు పాల్పడే వారి మూలాలను గుర్తించి నియంత్రించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి, గుట్కా రవాణాకు చేసిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించి వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయడం, గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికా రులు సేకరించాల్సిఉంటుందని, గంజాయి రవాణాకు పాల్పడే వారి సమాచారాన్ని తెలుసుకునేందుకు గాను పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి నియంత్రణలో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి రివార్డు తగిన పారితోషికం, మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు, రవాణా చేస్తున్నట్లు ఎవరైనా సమాచారం ఇచ్చిన వారి వివరాలు పేర్ల బయటకు రాకుండా గోప్యంగా వుంటుందని భరోసా కల్పించాలన్నారు.
డ్రగ్స్ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువత డ్రగ్స్‌వైపు మళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి సాగు చేసిన విక్రయాలు,రవాణా చేసిన ప్రభుత్వం అందించే అన్నిరకాల సబ్సిడీలను రద్దు చేస్తుందనే విషయాన్ని స్ధానికల ప్రజలలో తీసుకెళ్లాలని అన్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల విషయంగా గ్రామస్తులంతా అప్రమత్తమై ముందస్తు సమాచారం అందించేలా చైతన్య పరచాలి. వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం చేస్తున్న విధంగా.. డ్రగ్స్, గంజాయి దందా చేసేవారిపైనా పీడీ యాక్ట్‌లు నమోదు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా నేరస్తులను పట్టుకొని విచారించే క్రమంలో నిందితులను కోర్టుల ముందు ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం, వారికి డ్రగ్స్ అందిస్తున్న నెట్‌వర్క్ లింకులను గుర్తించి నిర్మూలించడమనేది కార్యాచరణగా చేపట్టాలన్నారు.
వృత్తివిద్య కాలేజీలు, విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలి. డ్రగ్స్ వినియోగం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ఉండేలా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలి. డ్రగ్స్ నియంత్రణపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులతో సమావేశాలు, సదస్సులు నిర్వహించాలన్నారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని. నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తే నిర్ద్వందంగా తిరస్కరించాలని సూచించారు. పోలీసులు సిబ్బంది గానీ డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే కఠినంగా వ్యవహరిస్తామని, తరచుగా సమీక్ష నిర్వహిస్తామని. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్భుత పనితీరు చూపే అధికారులు, సిబ్బందికి రివార్డులు, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తందని ఆయన చెప్పారు.