హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ దశ, దిశా లేనిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు నిరాశ ను మిగిల్చిందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అసత్యాలు, అంకెల గారడీ తప్ప ఏ వర్గానికి మేలు చేసేలా కేటాయింపు లు చేయలేదన్నారు. నూతన బడ్జెట్ లో కేటాయింపు లు పెంచక పోగా గతంలో ఉన్న వాటిలో కోతలు విధించడం దుర్మార్గం అన్నారు. జిడిపి విషయంలోకూడా తప్పుడు లెక్కలు చూపుతూ దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయస్థాయిలో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో, ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
మాటల గారడీతో గడచిన గత 8 ఏళ్లుగాదేశ ప్రజలను మోస్తునే ఉందని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి బడ్జెట్ లో మొండిచేయి చూపిందని విమర్శించారు. ఆయా రంగాల అభివృద్దికి విఘాతం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు ఉన్నాయని ఆరోపించారు. దేశంలో 15 లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఈ బడ్జెట్ లో నిరుద్యోగ సమస్య ఊసే లేకపోవడం దారుణమని అన్నారు. దేశం మొత్తం కరోనా మహమ్మారి తో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపును ప్రస్తావించకపోవడం ప్రజల ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో రుజువు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేయడంతో పాటు ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనే విధంగా అన్ని హాస్పిటల్స్ లలో అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.