వరకట్న వేధింపులే కారణంగా కేసు నమోదు
మన తెలంగాణ/పెద్దపల్లి : వరకట్న వేధింపులతో తల్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రమైన పెద్దపల్లి భూంనగర్‌లో నివసిస్తున్న చిగుర్ల మౌనిక(26) తన 18నెలల కూతురు జున్నుతో కలిసి ఎల్లమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎసిపి సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బైటకు తీయించారు. అనంతరం ఎసిపి సారంగపాణి మాట్లాడుతూ.. ధర్మారం మండలం బంజరుపల్లి గ్రామానికి చెందిన మౌనికకు సివిల్ సప్లయ్ సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. నాటి నుంచి వరకట్నం కోసం రమేష్ మౌనికను వేధించేవాడని, బుధవారం ఉదయం కూడా ఇదే విషయమై ఘర్షణ జరగడంతో మనస్తాపం చెందిన మౌనిక తన చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. మృతురాలి సోదరుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.