వాషింగ్టన్: ఇండియాకు వ్యతిరేకంగా చైనా-పాకిస్థాన్ కూటమిగా ఏర్పడ్డాయన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను అమెరికా సమర్థించలేదు. ‘తమ సంబంధాల విషయంలో పాకిస్థాన్, చైనాల వివరణకే దీనిని వదిలేస్తున్నాను. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నేను ఆమోదించబోవడంలేదు” అని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ బుధవారం చెప్పారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించినప్పుడు ఆయన ప్రతిస్పందిస్తూ ఈ విషయం తెలిపారు. మరో ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అమెరికా, చైనాల మధ్య దేనినో ఒక దానిని ఆయా దేశాలు ఎంచుకోవాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా ఆసక్తికర విషయం ఏమిటంటే, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం బీజింగ్ వెళ్లారు. అక్కడ ఆయన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సహా ఉన్నత చైనా నాయకులతో భేటీ కానున్నారు.
ప్రస్తుతం అమెరికా, చైనా సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా దిగజారాయి. దక్షిణ చైనా సముద్రం వివాదం, సైనిక చర్యలు, హాంకాంగ్, టిబెట్, జిన్‌జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన, వాణిజ్యం విషయంలో అమెరికా, చైనాలు ద్వేషించుకుంటున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ట్వీట్ చేశారు. “ 1963లో పాకిస్థాన్ షాక్స్‌గమ్ లోయను చైనాకు అక్రమంగా హస్తగతంచేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా 1970 దశకంలో చైనా కారాకోరం హైవేను నిర్మించింది. అంతేకాక 1970 దశకం నుంచి పాక్, చైనాలు అణు సహకారాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. 2013లో చైనాపాకిస్థాన్ ఆర్థిక నడవను నిర్మించడం ఆరంభించారు. అప్పట్లో చైనా, పాకిస్థాన్‌లు ఏమైనా దూరంగా ఉన్నాయా అన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి” అంటూ ఆయన ట్వీటర్ ద్వారా రాహుల్ గాంధీకి చురకనంటించారు, నిలదీశారు.