వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందేమోనన్న భయాందోళనల నేపథ్యంలో ‘నాటో’ తూర్పు పార్శంలోని మిత్రదేశాలకు అమెరికా దాదాపు 2000 మంది సైనిక బలగాన్ని పంపుతోంది. పోలాండ్, జర్మనీలకు దాదాపు 2000 మంది అమెరికా సైనికులను పంపుతున్నారని, జర్మనీ నుండి 1000 మంది సైనికులను రొమేనియాకు తరలిస్తున్నారని ‘పెంటగాన్’ బుధవారం తెలిపింది. దీనిపై రష్యా తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ విరుచుకుపడింది. ఈ మోహరింపులు నిరాధారమైనవని, వినాశకరమైనవని వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, బ్రిటిన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఈ రెండు దేశాల మధ్య చర్చ ఎలాంటి పురోగతిని సాధించలేదని తెలుస్తోంది. రష్యా భద్రత విషయంలో పాశ్చాత్య దేశాలు ఎలాంటి ఆసక్తిని కనబరచడంలేదని పుతిన్ అన్నారు.
కాగా ‘ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా శత్రుత్వ చర్యలు చేపడుతోంది’ అని బోరిస్ జాన్సన్ తెలిపారు. అమెరికా బలగాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించబోవని, కాకపోతే అమెరికా బలగాల మోహరింపు తాత్కాలికంగా మిత్రదేశాలకు దన్నుగా నిలబడి, స్థయిర్యాన్ని పెంచేందుకేనని ‘పెంటగాన్’ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా దాదాపు లక్ష బలగాలను నిలిపినందుకే ఇలా చేశామని వివరించారు. తీవ్రతను తగ్గించాలని అమెరికా చేసిన అభ్యర్థనను రష్యా పెడచెవిన పెట్టి గత 24 గంటల్లో మరిన్ని బలగాలను మోహరించిందని కూడా ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా నిరాధారంగా చేపడుతున్న చర్యలు సైనిక ఉద్రిక్తతలను పెంచగలదని, రాజకీయ నిర్ణయాలను తగ్గించేగలదని రష్యా ఉప విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ గ్రుష్‌కో ‘ఇంటర్‌ఫ్యాక్స్’ వార్తా సంస్థకు తెలిపారు.