హైదరాబాద్: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అందులో భాగంగానే ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్ ను ప్రధాని ఆవిష్కరించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని అభినందనలు తెలిపారు. వసంతపంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 50ఏళ్లుగా ఇక్రిశాట్ చేస్తున్న పరిశోధనలకు అభినందనలు చెప్పారు. వచ్చే యాభై ఏళ్లు మరిన్ని పరిశోధనలు జరపాలని ఆకాంక్షించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంటల దిగుబడి గణనీయంగా ఉందని తెలిపారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రంపచానికి కొత్త దారి చూపించాలన్నారు.
పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలన్నారు. వాతావరణ మార్పులకు తట్టుకునే వంగడాలను సృష్టించాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేయాలని చెప్పారు. భారత్ లో 80శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారు. దేశంలో చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారని, చిన్న రైతుల సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయన్న ఆయన దేశ వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలన్నారు. భారత్ లో 6 రుతువులు 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. భారత్ లో 50 వరకు ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.