వాషింగ్టన్ : అమెరికాలో కరోనా మరణాల సంఖ్య రికార్డుస్థాయిలో 9 లక్షలు దాటింది. రెండు నెలల క్రితం కరోనా తగ్గినట్టు కనిపించినా ఒమిక్రాన్ వ్యాప్తితో మళ్లీ విజృంభించింది. రెండు నెలల క్రితం 8 లక్షల వరకు మరణాలు ఉండగా, ఒమిక్రాన్ వ్యాప్తితో రోజుకు లక్షవరకు కేసులు నమోదై కేవలం రెండు నెలల్లోనే మరో లక్ష మరణాలు సంభవించాయయని జాన్స్ హాష్కిన్ష్ యూనివర్శిటీ వెల్లడించింది. ఈ సంఖ్య ఇండియానాపోలిస్, శాన్‌ఫ్రాన్సిస్కో, నార్త్ కరోలినా లోని మొత్తం జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. రెండేళ్ల క్రితమే ఇంత భారీ ఎత్తున మరణాలు సంభవించవచ్చని హెచ్చరించినా చాలామంది దీన్ని నమ్మలేదని బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ ఆషిష్ కె. ఝా చెప్పారు. టీకాలపై తప్పుడు అభిప్రాయాలను తొలగించి ప్రజలు టీకా పొందడంలో సహాయపడదామని అనుకున్నా తాము విఫలమయ్యామని చెప్పారు.
టీకాల తరువాత కూడా మరణాలు మరింత పెరిగాయని ఝా తెలిపారు. కొవిడ్ 19 అంతమవ్వక పోతే వచ్చే ఏప్రిల్ నాటికి మరణాల సంఖ్య 10 లక్షల మార్కును దాటే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2020 ఫిబ్రవరిలో అమెరికాలో తొలి కరోనా మరణం నమోదైంది. మొదటి నాలుగు నెలల్లో లక్ష దాటగా, 2020 సెప్టెంబర్ నాటికి 2 లక్షలు, డిసెంబర్ నాటికి 3 లక్షల మంది బలిఅయ్యారు. 2020 ఆఖరులో అమెరికాలో టీకా పంపిణీ ప్రారంభమైంది. అయినా మరణాలు ఆగడం లేదు. 2021 జూన్ నాటికి ఈ సంఖ్య 6 లక్షలకు చేరగా, అక్టోబర్ నాటికి 7 లక్షలు, గత ఏడాది డిసెంబర్ మధ్యలో 8 లక్షలకు మరణాల సంఖ్య చేరుకుంది. అమెరికా జనాభాలో 64 శాతం అంటే 212 మిలియన్ మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.
అధ్యక్షుడు జోబైడెన్ విచారం
దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఈ మహమ్మారి వల్ల కలిగిన నష్టం, మానసికంగా,శారీరకంగా చాలా భారమైందని, అమెరికన్లు అంతా వ్యాక్సిన్లతోపాటు బూస్టర్లను కూడా తీసుకోవాలని, తమతోపాటు కుటుంబ సభ్యులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.