న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీనే సిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించారు. లూథియానాలో నిర్వహించే ర్యాలీ సందర్భంగా అభ్యర్థిని ప్రకటించారు. ర్యాలీని ఉద్దేశిస్తూ పేదకుటుంబం అభ్యర్థియే సిఎం కావాలని పంజాబ్ ప్రజలు కోరుకుంటున్నారని రాహుల్ చెప్పారు. సిఎం అభ్యర్థిత్వ కోసం పోటీపడిన నవజ్యోత్ సింగ్ సిధ్ధూ జాట్ సిక్కు వర్గానికి చెందిన వారు. కాంగ్రెస్ అధిష్ఠానం సిఎం అభ్యర్థి ఎంపికలో నాయకులు, కార్యకర్తల నుంచి ప్రజల నుంచి ఫీడ్‌బాక్ రప్పించుకుంది.
ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి ప్రధానంగా రాష్ట్రముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చనీ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ నేపథ్యం లోనే ఇంరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా ప్రజాభిప్రాయాన్నిసేకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం , చన్నీ వైపే మొగ్గు చూపింది. సీఎం అభ్యర్థిత్వం పై చన్నీ , సిద్దూ మధ్య స్పర్థలు తలెత్తిన విషయం తెలిసిందే. అధిష్ఠానం వీరిద్దరికీ సర్ది చెప్పడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరువురు పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిని రాహుల్ ప్రకటించే కొన్ని గంటల ముందు సిద్ధూ పలు ట్వీట్లు చేశారు. స్పష్టమైన నిర్ణయం లేకుండా గొప్పదేదీ సాధించలేం. పార్టీ సిఎం అభ్యర్థి ఎవరనేదానిపై పంజాబ్‌కు క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన మా మార్గదర్శి రాహుల్ గాంధీకి హృదయపూర్వక స్వాగతం . ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అని రాసుకొచ్చారు.