73 ఏళ్ల పాటు నిర్విరామంగా సాగిన లతా దీదీ స్వర ప్రయాణం
ముంబయి: లతా మంగేష్కర్..ఆమె అసలు పేరు హేమ. హేమ అంటే బంగారం. ఆమె గాత్రమే కాదు.. వ్యక్తిత్వం కూడా బంగారమే ముప్ఫైకి పైగా ప్రాంతీయ, కొన్ని విదేశీ భాషలతో కలిపి దాదాపు 30 వేల చలనచిత్ర గీతాల్లో ఆమె మనకు కనిపిస్తారు. మనసులను తన స్వరంతో వికసింపజేస్తారు. ఆమె రాగాలు మన మనసులను ఉత్తేజితం చేస్తే.. ఆమె జీవనయానం మన హృదయాల్లో స్ఫూర్తి నింపుతుంది. సంగీత అభిమానులకు ఆమె మెలోడీ క్వీన్, ఇండియన్ నైటింగేల్ అయితే చాలా మందికి లతా దీదీ. లతాజీ పుట్టింది ఇండోర్‌లో. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్. ఆయన గాయకుడే కాక రంగస్థల నటుడు కూడా. తల్లి శేవంతీ మంగేష్కర్.
తండ్రి రాసిన ‘ భవబంధన్’ నాటకంలో నాయిక పేరు లతిక. ఆ పాత్రను చూసిన లతాజీ తన పేరును లతా మంగేష్కర్‌గా మార్చుకున్నారు. తండ్రి నడుపుతున్న నాటకాల కంపెనీలో ప్రదర్శించే సంగీత ప్రధానమైన నాటకాల్లో లత నటించడమే కాకుండా పాటలు పాడే వారు. కూతురిలో గాయనిని మొదట గుర్తించింది ఆమె తండ్రే. 5వ ఏటనుంచే నటించడం మొదలు పెట్టారామె. స్కూలుకు వెళ్లి తోటి విద్యార్థినులకు పాటలు నేర్పే వారు. దీన్ని గమనించిన టీచర్ ఆమెను బడికి రావద్దని చెప్పేశారు. అంతే లతాజీ బడికి వెళ్లడం మానేశారు. అయితే తన చెల్లెలు ఆశాభోంస్లేను తనతో పాటుగా బడికి రానివ్వనందుకే తాను బడి మానేసినట్లు లతాజీ ఓ అంగ్ల పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పడం గమనార్హం.
13వ ఏటే తొలి సినిమా పాట
తొలి గురువయిన తండ్రి సప్తస్వర జ్ఞానం అందిస్తే ఉద్దండ హిందుస్థానీ సంగీత గురువులైన అమన్ అలీఖాన్,అమానత్ ఖాన్‌ల వద్ద శిష్యరికం చేసి గాన కోకిలగా మారారు.ఆమెకు 13 ఏళ్ల వయసులో అంటే 1942లో ‘కిటి హసల్’ అనే మరాఠీ చిత్రం కోసం మొదటిసారిగా రికార్డింగ్‌స్టూడియోలో తన తొలి సినిమా పాటను రికార్డు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ చిత్రంలో ఆమె రెండు పాటలు పాడారు. వీటిలో ‘నాచు యా గాదె’ పాటను చిత్రం నిడివి ఎక్కువైందని ఎడిట్ చేశారు. రెండో పాట‘ నటాలీచైత్రాచి నవలాయ్’ మాత్రం లత తొలి మరాఠీపాటగా గ్రామఫోన్ రికార్డుల్లోకి ఎక్కింది. 1942లో తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ పెద్దగా ముగ్గురు చెల్లెళ్లు మీనా, ఆశా, ఉషా మంగేష్కర్‌లు, తమ్ముడు హృదయ్‌నాథ్ మంగేష్కర్‌ల పోషణా లతాజీ భుజాలపై పడింది.
దీంతో లతాజీ 1948 వరకు కేవలం పాటలనే నమ్ముకోకుండా ఎనిమిది చిత్రాల్లో వేషాలువేసి కుటుంబాన్ని లాక్కొచ్చారు. కుటుంబ పోషణ కోసం పెళ్లి చేసుకోకూడదని ఆమె అప్పుడే నిర్ణయించుకున్నారు. మొదట్లో నూర్జహాన్, షంషాద్ బేగం లాంటి గాయనీమణుల స్వరం విన్న సంగీత దర్శకులకు లతాజీ పక్వత చెందని స్వరం పీలగా, కీచుగా అనిపించి ఆమెను మొదట్లో తిరస్కరించారు. అయితే 1949లో ‘మహల్’ చిత్రంలో ఆమె పాడిన ‘ ఆయేగా ఆనేవాలా’ పాటతో ఆమె సుడి తిరిగింది. వద్దన్న సంగీత దర్శకులే ఆమె చుట్టూ తిరగడం మొదలైంది.
1953లో లతకు ఉత్తమ నేపథ్య గాయనిగా తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. అయితే ఆమె సున్నిత మనస్తత్వం కారణంగా స్టేజ్ మీదికి వచ్చి అవార్డు అందుకోవడానికి నిరాకరించారు. ఒక సంప్రదాయ భారత స్త్రీగా వస్త్రాలు లేని ఒక నగ్న స్త్రీ ప్రతిమను అందుకోలేనని ఆమె నిర్వాహకులకు చెప్పడంతో ఆ అవార్డు ప్రతిమకు జేబు రుమాలు చుట్టి అందించగా అప్పుడామె దాన్ని అందుకున్నారు.1962లో చైనా యుద్ధంలో ఓడిన జవాన్లను ఓదార్చుతూ లతాజీపాడిన ‘ ఆయె మేరీ వతన్‌కి లోగొం’ అనే పాటను విని కంట తడి పెట్టానని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా ఆమెకు చెప్పడం విశేషం. 1942నుంచి 2015 దాకా అంటే అవిశ్రాంతంగా 73 ఏళ్ల పాటు స్వరగాన యజ్ఞం చేసిన రికార్డు లత సొంతం. ఆమె చివరి పాట గత ఏడాది అక్టోబర్‌లో రికార్డు అయింది. 1990లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది.
పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించిన భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారత రత్నను కూడా అందించి గౌరవించింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి తర్వాత భారత రత్న పురస్కారం అందుకున్న రెండో గాయని లతాజీనే. లతకి క్రికెట్ అన్నా, సచిన్ తెండూల్కర్ అన్నా ఎంతో ఇష్టం. అయిదేళ్ల పాటు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న ఆమె ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. కోట్లాది మంది హృదయాల్లో గాన కోకిలగా మిగిలి పోయిన లతాజీ గొంతు శాశ్వతంగా మూగపోయినా ఆమె పాట మాత్రం రాబోయే తరాలకు కూడా గుర్తుండి పోతుంది.