Saturday, November 23, 2024

గ్రేటర్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం

- Advertisement -
- Advertisement -

Coronavirus decline in Greater Hyderabad

 

ప్రస్తుతం 700లోపే పాజిటివ్ కేసులు నమోదు
జాగ్రత్తలు పాటిస్తే ఈ నెలాఖరుకల్లా వైరస్ ప్రభావం తగ్గేచాన్స్
తగ్గుతున్నా మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి పాటించాలి
మార్కెట్లు, దుకాణాల వద్ద్ద వైరస్ విస్తరిస్తుందని వైద్యులు వెల్లడి

హైదరాబాద్: నగరంలో గత వారం రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య 700 లకు చేరుకుంది. మరో పది రోజుల సెంచరీలోపు నమోదైతాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పట్టణ ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టెస్టులు చేసుకొని పాజిటివ్‌గా వస్తే హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైరస్ ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ తరువాత మహమ్మారి విజృంభణ చేయడంతో వైద్యశాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు, బస్తీదవాఖానాల్లో టెస్టులు సంఖ్య పెంచడంతో జనం పెద్ద ఎత్తున పరీక్షలు చేసుకోవడంతో పది రోజుల పాటు భారీ కేసులు బయటపడ్డాయి. తరువాత క్రమంగా వైరస్ కేసులు తగ్గుతున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఫిబ్రవరి నెలాఖరకు వరకు ప్రజలు ముఖానికి మాస్కులు, శానిటైజర్, సమూహం వద్ద భౌతికదూరం పాటిస్తే కరోనా వేగం కట్టడి చేయవచ్చంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గతవారం రోజుల నుంచి వైద్యశాఖ పాజిటివ్ కేసులు గణాంకాలు పరిశీలిస్తే గత నెల 29వ తేదీన 1160 పాటిటివ్ కేసులు రాగా, 30న 1045 మందికి, 31వ తేదీన 746 కేసులు, ఫిబ్రవరి 1న 859 మందికి రాగా, 2వ తేదీన 747 కేసులు, 3న 649 మందికి సోకగా, 4వ తేదీన 688 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడిస్తున్నారు. వైరస్ ప్రభావం నా లుగు వారాల పాటు తీవ్రంగా ఉందని తరువాత తగ్గుముఖం పట్టిందని చెప్పారు. అదే విధంగా విద్యాసంస్థలు ప్రారంభించడంతో చిన్నారులు కొవిడ్ నిబంధనలు పాటించడం కష్టమని, మళ్లీ వచ్చే అవకాశముందని భావించిన బడులు ప్రారంభమై ఐదు రోజుల గడిచిన ఇప్పటి వరకు విద్యార్థులకు వైరస్ సోకినట్లు బయటపడలేదు. ఇదే విధంగా పాఠశాలల నిర్వాహకులు జాగ్రత్తలు పాటిస్తే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు పూర్తి చేస్తారని అధికారులు చెబుతున్నారు.

గ్రేటర్ పరిధిలో మార్కెట్లు, వస్త్ర దుకాణాలు, బార్లు, వైన్స్‌ల వద్దే భౌతికదూరం సక్రమంగా పాటించడం లేదని విమర్శలు వస్తుండగా, అక్కడ కొవిడ్ నిబంధనలు అమలు చేస్తే త్వరలో వైరస్‌ను అంతం చేయవచ్చని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి నగరంలో థర్డ్‌వేవ్ భయం జనాల్లో తగ్గిందని, కరోనా మొదటి, సెకండ్ డోసులతోపాటు బూస్టర్ డోసులు రావడంతో మహమ్మారి సో కిన రోగులు ధైర్యంగా ఉంటూ వైద్య చికిత్సలు పొందుతూ వారం రోజుల్లో కోలుకుని ఆరోగ్యంగా ఉంటున్నట్లు స్థానిక ప్రజలు వెల్లడిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య కార్యకర్తలు ఫీవర్ సర్వే చేపట్టి లక్షణాలున్న వారికి కొవిడ్ కిట్లు పంపిణీ చేసి వైరస్ విస్తరించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనితో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మంచిగా పనిచేసినట్లు తెలిపారు. కరోనా రోగానికి కార్పొరేట్ వైద్యం పరిష్కారం చూపదని, కొవిడ్ జాగ్రత్తలే వైరస్ విరుగుడుగా పనిచేస్తుందని వైద్యాధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News