పట్టించుకోని అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో బోగస్ ప్రైవేటు మోటారు డ్రైవింగ్ స్కూల్స్ రాజ్యమేలుతున్నాయి. ప్రజలు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షను, కారు నడపాలనే యువత క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు బోగస్ మోటారు డ్రైవింగ్ స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కారు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డ్యూయల్ స్టీరింగ్‌లు, గేర్ బాక్స్‌లు, హెడ్ లైట్లు, సీట్ బెల్టులు తదితర మౌలిక సదుపాయాలు లేకుండా, నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం కార్లతో బోగస్ స్కూల్స్ నడుతున్నారు.ఇక అనుమతి తీసుకున్న మోటారు డ్రైవింగ్ స్కూల్స్ యాజమాన్యాలు సైతం కొంత మంది అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక ప్రాంతంలో డ్రైవింగ్ స్కూల్‌కు తీసుకున్న అనుమతితో ఇతర ప్రాంతాల్లో రెండు మూడు డ్రైవింగ్ స్కూల్స్ నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మోటారు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే మెకానికల్ ఇంజినీరింగ్‌లో లేదా ఐటిఐ డీజిల్ మెకానిక్ డిప్లొమాతో పాటు బ్యాడ్జ్‌తో కూడిన హెవీ మోటారు వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
డ్రైవింగ్ శిక్షణ కోసం వచ్చే వారికి కారు నడిపే విధానం, రోడ్డు నిబంధనలు, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను వివరించడానికి ఒక తరగతి గది ఉండాలి. కారు ఎప్పుడైనా రోడ్డుపై అకస్మాత్తుగా చెడిపోయినప్పుడు, లేదా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు డ్రైవర్ సమస్యను పరిష్కరించుకునేందుకు కనీస అవగాహనను కల్పించాలి. తొలుత మైదాన ప్రాంతాలు, తరువాత ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వాలి. ఇవేవి అమలు చేయకుండానే కేవలం మైదానాల్లో తూతూ మంత్రంగా శిక్షణ ఇస్తూ ముప్పై రోజుల్లో ముప్పై గంటల్లో వందల మందికి కారు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చినట్లు డ్రైవింగ్ స్కూల్స్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా డ్రైవింగ్ స్కూల్స్‌లో కారు నేర్చుకున్న వారు కారు తీసుకుని ట్రాఫిక్ రద్దీ ఉన్న రోడ్లపైకి రాగానే అయోమయానికి గురవుతున్నారు. పలు సందర్భాల్లో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. డ్రైవింగ్ స్కూల్స్‌లో శిక్షణ పొందిన కారు డ్రైవర్లు సంపూర్ణ విశ్వాసంతో వాహనాలను నడిపే పరిస్థితి ఉండటం లేదు. ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతిక, నైపుణ్యం లేని డ్రైవింగ్ స్కూళ్ళ నిర్వాహకులకు రవాణా అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటి కోసం కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో రూ.80 వేల నుంచి లక్షాయాబై వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల సహాయంతో డ్రైవింగ్ స్కూల్ నిర్వాహణకు కావాల్సిన ఫామ్ 11 సంపాదిస్తున్నారు.
సాధారణంగా మోటారు వాహాన ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి డ్రైవింగ్ నిర్వహణను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరమే అనుమతులు ఇవ్వాలి. దీని కోసం నిర్వాహకులు రూ.10 వేలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రవాణశాఖకు చెల్లించాల్సి ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారే డ్రైవింగ్ నిర్వహణకు అర్హత కలిగి ఉంటారు. అనుభవం ఉన్న ఇన్‌స్ట్రక్టర్ ఉండాలి. కాని నిబంధనలకు విరుద్దంగా పలు డ్రైవింగ్ స్కూల్ నిర్వహకులు ఎటువంటి కార్యాలయం లేకుండా కారుపై డ్రౌవింగ్ స్కూల్ బోర్డు ఏర్పాటు చేసుకుని కొంత మంది అడ్డగోలు అనుమతులతో ఏర్పడుతున్న డ్రైవింగ్ స్కూళ్ళు అభ్యర్థుల నుంచి నెలకు రూ.5 వేల నుంచి 8 వేలు వసూలు చేసి కనీసం 30 రోజులు కూడా శిక్షణ ఇవ్వకుండా వదిలేస్తున్నారు. ఈ విధంగా అరకొర శిక్షణ తీసుకున్న వారు డ్రైవింగ్ లెసెన్స్‌లు తీసుకుని ఖరీదైన వాహనాలనుల రోడ్దు మీదకు తీసుకు వస్తూ ప్రమాదాలు చేస్తూ అమాయకులు ప్రాణాలను తీస్తున్నారు. గ్రేటర్‌లో అన్ని ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ స్కూళ్ళు సమారు 135 వరకు ఉంటే నకిలీ స్కూళ్ళు సుమారు వెయ్యికిపైగానే ఉన్నాయి.