హైదరాబాద్ : 7ఆర్ట్స్ బోల్డ్ బ్యూటీ సరయూను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 7ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య పదాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న సరయూపై హిందువులను కించపర్చారని రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఏడాది పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో సరయు ఆమె స్నేహితులు కలిసి సిరిసిల్లలో 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. దీని కోసం సరయు ఓ షార్ట్ ఫిలీంను రూపొందించారు. ఆ వీడియోను గతేడాది ఫిబ్రవరి 25న తమ 7ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దానిలో గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు తలకు ధరించారు. ఆ వీడియోలో కంటెంట్ హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ రాజన్న సిరిసిల్ల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణ చేసిన పోలీసులు వీడియోను బంజారాహిల్స్ పరిధిలోని ఫిలంనగర్‌లో చిత్రీకరించినట్లు గుర్తించారు. దీంతో కేసును బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో సరయును అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌ను తరలించారు.