మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 11న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
వెంటనే చేద్దామన్నారు…
ఈ సినిమా కథను దర్శకుడు రమేష్ వర్మ నాకు చెప్పగానే నచ్చింది. ఇది రవితేజకి బాగుంటుందని అన్నాను. ఆయన కథ వినగానే ఈ సినిమా చేస్తానని మాటిచ్చారు. వెంటనే సినిమా చేసేద్దామని రవితేజ అన్నారు.
హాలీవుడ్ రేంజ్‌లో…
రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఇలాంటి పాయింట్‌తో ఇది వరకు సినిమా రాలేదు. కొత్త పాయింట్‌తో రాబోతోంది. బాలీవుడ్ మూవీలా ఉంటుంది. ఇటలీలో కొన్ని షాట్లు తీశాం. వాటిని చూస్తే హాలీవుడ్ రేంజ్‌లో అనిపిస్తుంది. సినిమా ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది.
ఛాలెంజ్‌లా తీసుకొని…
ఈ కథను ఆల్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్దామని పెన్ స్టూడియోస్‌తో కలిశాం. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. ఇక రమేష్ వర్మ ఛాలెంజ్‌లా తీసుకొని చెప్పిన సమయానికి సినిమాను రెడీ చేసి ఇచ్చారు.
తదుపరి చిత్రాలు…
హవీష్ ప్రస్తుతం సంజయ్ రామస్వామి అనే సినిమాను చేస్తున్నాడు. ఆ స్టోరీ, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది. రాక్షసుడు 2 కూడా ప్లాన్ చేస్తున్నాం. వంద కోట్ల ‘యోధ్’ అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం.
అద్భుతమైన సంగీతం…
ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఐదు పాటలు హిట్ అయ్యాయి. హీరోయిన్లు కూడా చక్కగా నటించారు.