తనకు దొరికిన 10తులాల బంగారు నగలు పోలీసులకు అప్పగింత
సన్మానం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: రోడ్డుపై పడిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పగించి ఆటోడ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని లంగర్‌హౌస్‌లో మంగళవారం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం…లంగర్‌హౌస్‌లోని ఆశం నగర్ ప్రాంతానికి చెందిన మీర్జా సుల్తాన్ బేక్ ఓ హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం భార్యతో కలిసి మోటార్‌సైకిల్ ఆశం నగర్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా బైక్ ముందు పెట్టుకున్న నగల బ్యాగు కిందపడిపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత చూసేసరికి బ్యాగు కన్పించలేదు. వెంటనే వెనుకకు వచ్చి లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పిల్లర్ నంబర్ 55వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా తనకు బ్యాగు దొరికిందన ఆటోడ్రైవర్ సయ్యద్ జకీర్ పోలీసులకు అందజేశాడు. నిజాయితీగా బంగారు ఆభరణాల బ్యాగును ఇచ్చిన ఆటోడ్రైవర్ సయ్యద్ జకీర్‌ను పోలీసులు, స్థానికులు అభినందించారు. బంగారు ఆభరణాల బ్యాగును అందించిన సయ్యద్‌జకీర్‌కు పోలీసులు సన్మానం చేశారు. పోయిన బంగారు నగల బ్యాగు తిరిగి దొరకడంతో సుల్తాన్ బేగ్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.