Saturday, November 23, 2024

నగరంలో మరో రెండు సి అండ్ డి ప్లాంట్ల ఏర్పాటుకు జిహెచ్‌ఎంసి ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లో మరో రెండు నిర్మాణ వ్యర్థాల రిసైక్లింగ్ ప్లాంట్లు రానున్నాయి. నగరంలో నిర్మాణ, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్మాణ వ్యర్థాలు అదే స్థాయిలో వెలువడుతుండడంతో అదనంగా మరో 2 ప్లాంట్ల ఏర్పాటుకు జిహెచ్‌ఎంసి కసరత్తును మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సౌత్, నార్త్ జోన్ లలో వీటిని ఏర్పాటు చేసేందుకు టెండర్లను పిలిచారు. ప్లాంట్ ఏర్పాటులో భాగంగా ట్రాన్స్పోర్టేషన్, ప్రాసెసింగ్ కోసం నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో కనీసం 5 ఎకరాల సొంత భూమి ఉండి తీరాలి. టెండర్ లో కండిషన్ పెట్టడం పెట్టారు. ఈ నెల 21 తేదీ వరకు గడువు విధించారు.

ఇప్పటికే రెండు ప్లాంట్లు ఏర్పాటు:

ఇప్పటికే నగరంలో రెండు ప్లాంట్లను జీడిమెట్ల, ఫతుల్లగూడ ఏర్పాటు చేసిన బల్దియా మరో రెండు ప్లాంట్ లను ఏర్పాటు చేస్తే నగర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న నిర్మాణ వ్యర్థాలను సత్వర తొలగింపుకు మార్గం మరింతసులభతరం కానుంది. ముందుగా జీడిమెట్ల, ఫతుల్లగూడ, మల్లాపూర్, కొత్వాల్ గూడ ప్రాంతంలో సి అండ్‌డి ) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్వాల్ గూడ, మల్లాపూర్ లో స్థల ప్రభావం వలన ప్లాంట్ నెలకొల్ప లేక పోయారు. జీడిమెట్ల, ఫతుల్లగుడలో ఏర్పాటుచేసి సి అండ్ డి ప్లాంట్ల ద్వారా రోజుకు 500 టన్నుల చోప్పున టి.పి.డి కెపాసిటీ వెట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ (వాటర్, వాషింగ్ క్రషింగ్) సెమీ ఆటోమేటిక్ సిస్టం ద్వారా దుమ్ము పొల్యూషన్ లేకుండా క్రషింగ్ కొనసాగుతోంది. సి అండి డి ప్లాంట్ జీడిమెట్ల ప్లాంట్ ఏప్రిల్ 2020 నుండి ఫతుల్లగూడ ప్లాంట్ మే 2021 నుండి ప్రారంభం అయ్యాయి. అయితే నిర్మాణ వ్యర్ధాలను 2018 నుండి స్వచ్ఛ భారత్ లో భాగంగా సేకరిస్తున్నారు.

రోజుకు 2వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి:

గ్రేటర్‌లో నిర్మాణ రంగం శర విస్తరిస్తుండడంతో నిర్మాణ వ్యర్థాలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. ప్రతిరోజు దాదాపుగా 2 వేల మెట్రిక్ టన్నుల వరకు వెలువడుతున్నట్లు అధికారుల అంచన. దీంతో నగరవాసులతోపాటు పర్యావరణ పరిరక్షణపై ఏలాంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో ఖర్చు కు వెనకాడకుండా బల్దియా సి అండ్ డి ప్లాంట్ ఏర్పాటు కు నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో నిర్మాణ వ్యర్థాల రిసైక్లింగ్ ప్లాంట్లను మొట్ట మొదటగా హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని 30 సర్కిళ్లకు గాను 15 సర్కిల్ పరిధిలో వెలువడుతున్న నిర్మాణ వ్యర్ధాలను జీడిమెట్ల, ఫతుల్లగూడ ప్లాంట్ ద్వారా సేకరిస్తున్నారు.

జీడిమెట్ల ప్లాంట్ కు ఖైరతాబాద్ సర్కిల్, జూబ్లీహిల్స్ యూసుఫ్ గూడ, చందానగర్, ఆర్.సి పురం, పిటిసి, మూసాపేట్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, బేగంపేట సర్కిళ్లలో సేకరణ చేసేందుకు నిర్ణయించారు. అదే విధంగా ఫతుల్లగూడ ప్లాంట్ కు ఎల్.బి నగర్, సరూర్ నగర్ మలక్ పేట్, హయాత్ నగర్ సర్కిల్ లను కేటాయించారు. నిర్మాణ వ్యర్థాలు తరలించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 120 1159 నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు కాల్ చేస్తే వారే వచ్చి తీసుకొని వెళ్లుతారు. అయితే జీడిమెట్ల ఏరియాలో ప్రాసెసింగ్ ట్రాన్స్పోర్టేషన్ మెట్రిక్ టన్ను కు రూ. 350.59 చొప్పున చెల్లించాలి. ఫతుల్లగూడ కలెక్షన్ ఏరియాలో రూ. 342 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇదేక్రమంలో మిగితా 15 సర్కిల్ లో కూడా రోజు రోజుకు పెరుగుతున్న వ్యర్థాలను తొలగించడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరో 2 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News