Monday, January 20, 2025

అన్నదాతల ఆక్రందనలు

- Advertisement -
- Advertisement -

historical injustice to farmers with indian politicians

దేశ ప్రజల ఆకలి దీర్చే అన్నదాతలు రైతులు. మనిషి కనీసావసరాల్లో అతి ప్రధానమైన ఆహార పదార్ధాలను పండించే సృష్టికర్తలు, అజాత శత్రువులైన ఈ రైతులు అలిగితే దేశం ఆకలి మంటలతో అల్లాడి పోవాల్సిందే. కాని ఆ రైతే ఆకలి మంటలతో, అప్పుల భారంతో అల్లాడిపోతూ ఆత్మహత్యల పాలు కావడం ఈ దేశంలోని ప్రధాన వైరుధ్యం. కారణాలేవైనా అన్నదాత రైతు తన ఘర్మ జలంతో భూమాతను తడిపే కర్షకుడు ఈ దేశంలో సుఖంగా లేడు. రైతు బతుకులో వెలుగు లేదంటే దేశం గొప్పగా ఉన్నట్టు కాదు. ఎన్ని కంప్యూటర్లు, ఎన్ని పరిశ్రమలు, ఇతర సంపదెంతున్నా ఆకాలి తీర్చే అన్నదాత సంతృప్తిగా లెదంటే దేశం సుభిక్షంగా ఉన్నట్టుకాదు. రైతంటే ఓ కులం కాదు. వ్యవసాయ వృత్తి మిగతా కుల వృత్తుల్లా ఏ ఒక్క కులం వృత్తి కాదు. ఈ పనిని అన్ని కులాల వారు కొద్దోగొప్పో భూమున్న వారితో పాటు భూమి లేని వారు కూడా వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. అయితే చాలా ప్రభుత్వా లకు ఈ రైతులంటే చులకన. వాళ్ళ రెక్కల కష్టంతోనే తమ కడుపులు నిండుతున్నాయన్న ‘సోయి’ పాలకులకు లేదు. పారిశ్రామిక వస్తువు ఉత్పత్తి చేసే ప్రతి పారిశ్రామికవేత్త తాము కర్మాగారంలో ఉత్పత్తి అయిన వస్తువుకు తానే ధర నిర్ణయిస్తాడు. రైతుకుమాత్రం తన పంటకు తాను ధర నిర్ణయించుకునే అధికారం లేదు. ప్రభుత్వమే నిర్ణయించాలి. ఈ దేశంలో రైతు పరిస్థితి కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్లే ఉంది.
అతివృష్టి, అనావృష్టి, నాణ్యమైన విత్తనాల కొరత, కరెంటు కోత, ఎరువుల ధరలు, పెట్టుబడికి డబ్బులు లేక, అప్పుల భారం రైతును పీడిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను, చీడపీడలను తట్టుకొని పంటలు పండించినా కేంద్రం ప్రభుత్వం కొనకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడం లాంటి అనేక సమస్యల వల్ల రైతు అప్పుల పాలవుతున్నాడు. ఆత్మహత్యల పాలూ అవుతున్నాడు. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలోనూ అన్నదాతలు అదే స్థితిలో ఉన్నారంటే మనం సిగ్గుతో తలవంచుకోవల్సిందే. ఇవన్నీ చాలా వన్నట్టు బిజెపి ప్రభుత్వం రైతులను మరింత పరాధీనులను చేయడానికి చేసిన చట్టాలు గర్హనీయం. ఈ చట్టాలు ఇదు వరకే అష్టకష్టాల్లో ఉన్న రైతులను మరింత నష్టాల ఊబిలోకి నెట్టడానికే. తమకు కష్టంగా ఉందని మొర పెట్టుకుంటే చిన్న గీత పక్కన పెద్దగీత పెట్టినట్లున్నావీ. రైతు చట్టాలు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని భారతదేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీ కెళ్ళి ధర్నా చేయడం చరిత్రాత్మకం. దాదాపు సంవత్సర కాలం ఎండలో, వానలో, చలిలో అనేక కష్టనష్టాలకోర్చి వీరోచిత పోరాటం చేసారు. వందల మంది వరకు ఈ పోరాటంలో అసువులు బాసారు.
దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ రైతుల పోరాటానికి మద్దతు లభించడం మంచి పరిణామం. ఎంత మంది మరణించినా, ఎవరి మద్దతు ఎంత ఉన్నా దిగిరాని కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది ఉపఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో పాలక పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో దిగొచ్చింది. రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాలను వెనుకకు తీసుకుంది. అంటే పెద్దగీతను చెరపేసి ఇదు వరకున్న సమస్యలను మాత్రం అలాగే ఉంచింది. చట్టాలనువెనుకకు తీసుకోవడం రైతులపై ప్రేమతో కాదు. సమీపంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు. రైతులపై ప్రేమే ఉంటే ఆయా రాష్ట్రాల్లోంచి కొనాల్సిన ధాన్యాన్ని కొననని భీష్మించుకొని కూర్చోవడం ఏ సంస్కృతికి నిదర్శనం..? గిట్టుబాటు ధర గురించి నోరు కూడా మెదపకపోవడం రైతును అధ్వాన పుటడవిలోకి నెట్టి వేయడమేకదా! రైతు చట్టాలను వెనుకకు తీసుకోవడాన్ని బిజెపిని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ స్వాగతించినా ఆ సమర్ధింపు వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి.
మన దేశంలో రైతున్నల సమస్యలకు పరిష్కారాలెప్పుడు లభిస్తాయి? అన్నదాతల కండ్లలో ఆనంద బాష్పాలు వచ్చేదెన్నడు? వ్యవసాయం లాభసాటిగా మారి అభివృధ్ధి చెందిన దేశాల్లోలా విద్యావంతులు కూడా వ్యవసాయం వైపు, పల్లెల వైపు దృష్టి సారించేదెప్పుడు? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలి పోతున్నాయి. రాజకీయ కళ్ళద్దాలను, వివిధ పార్టీల జెండాలరంగు కళ్ళద్దాలతో కాకుండా సమదృష్టితో, వాస్తవిక దృష్టికోణంలో చూసినపుడు మనకు అవగతమయ్యే ముఖ్య విషయాలు చాలానే ఉన్నాయి. రైతులు, వ్యవసాయ భూములు, వ్యవసాయాధారిత పనులతో బతికేవారై ఉండేది గ్రామాల్లోనే కాని ఆ గ్రామాలు, వ్యవసాయం నిరాదరణకు గురవుతూనే ఉన్నాయి. బంగారం పండే భూములు కాంక్రీటు వనాలుగా మారుతున్నాయి. క్రమక్రమంగా వ్యవసాయ భూమి తగ్గుతుంది. జనభా పెరుగుతుంది. గ్రామాల్లో వ్యవసాయాలు సంక్షోభానికి గురయి వలసలు పెరిగాయి. చదువుకొని, ఉద్యోగాలు చేసిన వాళ్ళెవరూగ్రామాల్లో ఉండటం లేదు. రైతును పట్టించుకున్న వారులేరు. గ్రామాలు దుమ్ము కొట్టుకుపోతూ ఏ సౌకర్యాలు లేని విధంగానే ఉంటున్నాయి.
రైతు జీవితం బాగుపడాలంటే రైతుండే గ్రామాలు బాగు పడాలి. వ్యవసాయం ఆధునీకరింపబడాలి. గ్రామాలు, పట్టణ సౌకర్యాలతో అభివృద్ధి చెందాలి. నీటి వసతుండాలి, కరెంటు కోతలుండకూడదు. రైతు వ్యవసాయాన్ని ఓ బాధ్యతగా స్వీకరించి చేస్తాడు. కాని రైతు తీసుకునే బాధ్యతాయుత వ్యవసాయం, నిజాయితీ, వ్యాపార మనస్తత్వం లేని మంచితనం అతనికి ఉరితాళ్ళవుతున్నాయి. గ్రామాభివృద్ధి వ్యవసాయ భూములు పరిరక్షణ, ప్రాకృతిక సౌందర్యాన్ని కాపాడుతూ గ్రామాల నుంచే స్థితి, గ్రామాలను పచ్చదనంతో ఆక్సిజన్ నిధులుగా ఉంచే విధానాలు, గ్రామీణ జనానికి ఉపాధి అవకాశాలు గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతాయి. విద్యావంతులను కూడా గ్రామాలు, వ్యవసాయం ఆకర్షించే లా ఉండాలి. గ్రామం ప్రగతి పథంలో నడుస్తుందంటే వ్యవసాయం తద్వారా రైతు సుఖంగా ఉన్నట్టే.
గ్రామీణాభివృధ్ధితో పాటు వ్యవసాయం దండుగ కాదు పండుగఅనే పరిస్థితులు రావాలి. వ్యవసాయ భూమి ఎంతున్నా ఆభూములకు నీటి వసతి లేకుంటే పంటలు పండవు. అందుకు కావాల్సినన్ని ప్రొజెక్టులు, చెరువులు, కుంటలు, నీటి పారుదల వసతులు, నాణ్యమైన విద్యుత్తులాంటివి కావాలి. మంచి విత్తనాలను సరఫరా చేయడం, ఎరువులను ఇవ్వడం, పెట్టుబడి సాయం, రుణమాఫీ లాంటివన్నీ చేయాలి. పాతాళంలోకి పోయిన భూగర్భజలాలను పైపైకి రప్పించాలి రైతును హృదయానికి హత్తుకొనే పాలకులుండాలి. ఇక మూడవ విషయం భూముంది, నీటి వసతుంది. పెట్టుబడి సాయం లాంటివీ ఉన్నాయి. ప్రభుత్వం రైతు నష్టపోకుండా వ్యవసాయాన్ని పండుగ చేసుకుంటానికి అన్ని విధాలా సాయమందిస్తుంది. పంటలు బాగానే పండుతున్నాయి. కాని ఆ పంటలను కొనాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. రైతు ధాన్యాన్ని కొనవలసిన ప్రభుత్వమే కొనకుంటే, రైతుకు గిట్టుబాటు ధర రాకుంటే పంట పండించి ఏం లాభం? పండిన పంటను కొనేవారు లేక ప్రైవేటు వ్యాపారులకు అతి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవడం జరుగుతూనే ఉంది. లేదా ఆ పంటను నీళ్ళపాలు చేసి దుఃఖించే రైతులెంతో మందున్నారు. వ్యవసాయిక దేశం, పల్లెల్లో నివసించే తత్వమున్న భారత దేశంలో గ్రామీణాభివృద్ధిని, వ్యవసాయాన్ని, రైతు ను విస్మరించిన ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలు కానేరవు. బిజెపి ఆ పనిని వ్యవసాయ చట్టాల రూపంలో చేయబోయి బోల్తా పడింది. అయినా తన రైతు వ్యతిరేక స్వభావాన్ని కోల్పోకుండా రైతును హృదయానికి హత్తుకొని పని చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వాని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా దృష్టిని కేంద్రీకరించింది. గ్రామీణాభివృద్ధిపై, వ్యవసాయంపై, పచ్చదనాన్ని కాపాడటానికై గ్రామాలు ప్రాకృతిక స్వభావాన్ని కోల్పోకుండా ఉండటానికి హరితహరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ ద్వారా సాగునీరు, తాగునీరు, సమస్య తీర్చారు. ప్రపంచాద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనతికాలంలోనే పూర్తి చేసి, నాణ్యమైన కరెంటు సరఫరా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసారు. రైతు బంధు, రుణ మాఫీ, వృద్ధాప్య పెన్షన్, పెట్టుబడి సాయం, పంటల బీమా లాంటివి ప్రవేశ పెట్టి రైతుల ఆత్మబంధువయ్యాడు. పంటల మార్పిడి, నాణ్యమైన విత్తనాల సరఫరా, ఎరువుల సరఫరా లాంటివి సక్రమంగా చేసి పంటలు బాగా పండించడానికి దోహదం చేసాడు. దక్షిణ భారత ధాన్యాగారం గానూ, దేశంలోనే బియ్యం పండించే రాష్ట్రాల్లో మొదటిదిగానూ తెలంగాణ మారింది.
గ్రామీణాభివృద్ధిని, ప్రకృతి సంరక్షణను, రైతు అభ్యున్నతిని ప్రధానాంశాలుగా తీసుకొని పథకాలు రూపొందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధులాంటి పథకాల గురించి దేశంలోని అన్నిరాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. హరిత హారం, రైతు బంధు తదితరాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఇది తెలంగాణలో అడుగుపెట్టాలనుకుంటున్న బిజెపికి నచ్చదు. తెలంగాణ నుంచి పండుతున్న బియ్యాన్ని కొనడానికి కేంద్రం ఒప్పుకోవడం లేదు. వరి, పండించ వద్దని ఆంక్షలు పెడుతుంది. తెలంగాణను ధాన్యాగారంగా, జలసిరిగా, ఆక్సిజన్ నిధిగా మార్చిన కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయడమే కేంద్రం ఉద్దేశం. తాము చేసే పనుల ద్వారా కాకుండా రైతు బంధువుగా పని చేస్తున్న కెసిఆర్‌ను ధాన్యం కొనుగోలు విషయంలో బదునాం చేస్తూ రాజకీయ లబ్ధిపొందాలని చూడటం హేయమైన చర్య. రాజ్యాంగాన్ని గౌరవించకుండా రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెడ్తూ, ఫెడరల్ స్ఫూర్తికి కూడా భంగం కలిగిస్తూ తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బిజెపికి అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో వలెనే శృంగభంగం తప్పదు. పంటల మార్పిడి, భూసారాన్ని పరీక్షిస్తూ ఏ భూమిలో ఏ పంట వెయాలని నిర్ణయించడం, కల్తీ లేని విత్తనాల సరఫరా, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సమయానికి ఎరువుల పంపిణిచేస్తూ రైతులకు అండదండగా నిలుస్తున్నాడు కెసిఆర్. ధాన్యం కొనుగోలు, గిట్టుబాటు ధర విషయాల్లోనూ కేంద్రం బాధ్యతా రాహిత్యాన్ని ఎదుర్కొని రైతు నాదుకోవడంలో ముందుంటారని ఆశిద్దాం…

 

డా॥కాలువ మల్లయ్య
9182918567

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News