కొత్త పరీక్షను ఆవిష్కరించిన చైనా శాస్త్రవేత్తలు
బీజింగ్ : ఇటీవల సింగపూర్ శాస్త్రవేత్తలు ఐదు నిమిషాల్లోనే కరోనా ఫలితాలు వెల్లడించే బ్రీత్‌లైజర్‌ను అభివృద్ధి చేయగా, తాజాగా తాము కేవలం నాలుగు నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడించే కొత్త పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేసినట్టు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. పీసీఆర్ టెస్ట్ లాగే ఇదీ కచ్చితమైన రిజల్ట్ వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీ పీసీఆర్ విధానాన్నే వైరస్ నిర్ధారణకు అత్యంత విశ్వసనీయ పరీక్షగా భావిస్తున్నారు. అయితే దీని ద్వారా ఫలితాల వెల్లడికి చాలా సమయం పడుతోంది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా తొందరగానే రిజల్ట్ వస్తున్నా తప్పుడు ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో టెస్టింగ్ డిమాండ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త కిట్‌ను అభివృద్ధి చేసినట్టు షాంఘై లోని ఫుడాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ జర్నల్‌లో సంబంధిత వివరాలు ప్రచురితమయ్యాయి. సేకరించిన నమూనాల్లో సార్స్‌కొవ్ 2 ను జాడను గుర్తించడానికి ఇంటిగ్రేటెడ్ పోర్టబుల్ ప్రోటోటైప్ కిట్‌లో ఎలక్ట్రోమెకానికల్ బయోసెన్సార్‌ను అమ ర్చాం. నమూనాల్లోని జన్యు పదార్ధాన్ని ఇది వేగంగా విశ్లేషించి, నాలుగు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో కచ్చితత్వంతో ఫలితాలను వెల్లడించింది.” అని శాస్త్రవేత్తలు వివరించారు. ట్రయల్స్‌లో భాగంగా షాంఘైలోని 33 మంది కరోనా బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పీసీఆర్‌తోపాటు కొత్త విధానంలోనూ పరీక్షించారు. రెండింటిలో ఒకే విధమైన ఫలితాలు వచ్చినట్టు తెలిపారు. కరోనాలేని 54 మంది నమూనాల విషయం లోనూ ఎలాంటి తప్పుడు ఫలితాలు వెల్లడించలేదని చెప్పారు. కొత్త పరీక్ష కిట్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తరువాత విమానాశ్రయాలు, ఆస్పత్రులు, ఇంటివద్ద ఇలా ఎక్కడైనా ఉపయోగించవచ్చన్నారు.