మోడీ వల్లే ఆర్థికంగా నష్టపోయా
ఫేస్‌బుక్ లైవ్‌లో వ్యాపారి ఆత్మహత్యాయత్నం
భర్తతోపాటే విషం తాగి భార్య మృతి
బాగ్‌పట్(యుపి): తాను ఆర్థికంగా నష్టపోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ కారణమని ఆరోపిస్తూ ఒక స్థానిక చిరు వ్యాపారి బుధవారం ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా ఆయనతో పాటే విషం తాగిన ఆయన భార్య మరణించింది. బాగ్‌పట్ ఎస్‌పి నీరజ్ కుమార్ జాదవ్ బుధవారం ఈ సంఘటనను ధ్రువీకరించారు. ఆత్మహత్యకు పాల్పడిన చెప్పుల దుకాణం యజమాని రాజీవ్ తోమర్(40) పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఫేస్‌బుక్ లైవ్‌లో రాజీవ్ తోమర్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్తను అడ్డుకోవడానికి ప్రయత్నించినపూనమ్ కూడా విషం తాగారు. వెంటనే వీరిద్దరినీ సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పూనమ్ అక్కడ మరణించారు. తోమర్ పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌పి చెప్పారు. తన చావుకు మోడీ కారణమని తోమర్ ఆ ఫేస్‌బుక్ వీడియోలో ఆరోపించారు. మోడీకి ఏమాత్రం సిగ్గున్నా పరిస్థితిని ఆయన మారుస్తారని తోమర్ అన్నారు. ప్రతి విషయంలో మోడీని తప్పని తాను అనడం లేదని, అయితే ఆయన చిరు వ్యాపారులకు, రైతులకు శ్రేయోభిలాషి కారని తోమర్ అన్నారు. భర్తను వారించే ప్రయత్నంలో తోమర్ భార్య పూనమ్ కూడా విషం తాగారు. చెప్పుల వ్యాపారం చేసే తోమర్ 2020లో లాక్ డౌన్ కారణంగా దుకాణాన్ని చాలా కాలం మూసివేయవలసి వచ్చింది. దీంతో దుకాణంలోని చెప్పులన్నీ పాడై పోవడంతో ఆయన ఆర్థికంగా చాలా నష్టపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రియాంక గాంధీ విచారం
ఇదిలా ఉండగా, చిరువ్యాపారి రాజీవ్ తోమర్ దంపతుల ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లక్నోలో స్పందించారు. ఈ సంఘటన విచారకరమని, రాజీవ్ తోమర్ పరిస్థితి విషమంగా ఉండగా ఆయన భార్య మరణించారని ఆమె తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, లాక్‌డౌన్ వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆమె చెప్పారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు.
https://twitter.com/ashubh/status/1491104553961672704?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1491104553961672704%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fashubh2Fstatus2F1491104553961672704widget%3DTweet
UP Trader suicide in Facebook live as PM Modi