సుధీర్ బాబు నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ’శివ మనసులో శృతి’ మేల్ లీడ్‌గా అతని మొదటి చిత్రం. ఈ సినిమా 2012 సంవత్సరం ఫిబ్రవరి 10న విడుదలైంది. గురువారానికి ఆయన సినిమాల్లోకి వచ్చి పదేళ్లు పూర్తవుతాయి. శ్రీదేవి సోడా సెంటర్, సమ్మోహనం వంటి చిత్రాలు సుధీర్‌బాబుకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే రొమ్-కామ్‌లో ఆయన నటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఆ ఏకైక లక్షంతోనే…
నేను చేసిన సినిమాల సంఖ్య, సంపాదించిన అభిమానుల సంఖ్య కంటే, నటుడిగా నేను సంపాదించిన గౌరవమే ముఖ్యం. నటుడిగా వందశాతం కష్టపడ్డాను. ఆ సంతృప్తి నాకు ఉంది. – మొదట్ల్లో ఇన్నేళ్ళ కెరీర్ వుంటుందని రాలేదు. సినిమాపై తపనతోనే వచ్చాను. నాకంటూ గుర్తింపు, గౌరవం ఉండాలన్న ఏకైక లక్ష్యంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ఎప్పటికప్పుడు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాను.
యాక్షన్ సినిమాలు చేయబోతున్నా…
నాకు యాక్షన్ చిత్రాలంటే ఇష్టం. నేను జాకీ చాన్‌కి పెద్ద అభిమానిని. బెంచ్ మార్క్ యాక్షన్ సినిమాలు చేయబోతున్నాను. నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్‌తో ఓ సినిమా చేస్తాను. ‘లూజర్ 2’ (వెబ్ సిరీస్) దర్శకుడు నాతో సినిమా చేయనున్నాడు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది.
నటుడిగా నిరూపించుకోవాలని…
కొత్త జోనర్‌లను ప్రయత్నించాలని సమ్మోహనం, ప్రేమ కథా చిత్రమ్ చేశాను. నేను హీరోగా కెరీర్‌ను ప్రారంభించాను కానీ నటుడిగా కూడా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే నేను హిందీలో ’బాఘీ’ సినిమా చేశాను. అందులో నాది చాలా మంచి పాత్ర.
బాలీవుడ్ ప్రేక్షకులు వీక్షించారు…
నాకు పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఉంది. తెలుగులో పాన్ ఇండియా కథలు ఉన్నాయి. నా సినిమాలన్నీ హిందీలోకి డబ్ అయి బాలీవుడ్ ప్రేక్షకులు వీక్షించారు. ’బాహుబలి’ రాకముందే ప్రభాస్, ఎస్‌ఎస్ రాజమౌళిల సినిమాలను హిందీ ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. అందుకే బాహుబలి అంత హిట్ అయింది.
అదే నా కోరిక…
కెరీర్ పరంగా కృష్ణ, మహేష్‌ల నుంచి చాలా నేర్చుకున్నా. ‘ప్రేమ కథా చిత్రమ్’ విడుదలైనప్పుడు మహేష్ నన్ను మెచ్చుకున్నారు. గత పదేళ్లలో నేనెప్పుడూ మహేష్‌ని ఏది కోరలేదు. అయితే మంచి కథ దొరికితే మహేష్‌తో నటించాలనేది నా కోరిక.