కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: కారులో ముందు సీటులో కూర్చునే ప్రయాణికులకు త్రీ-పాయింట్ సీటు బెల్టులు తప్పనసరిగా సమకూర్చాలని కార్ల తయారీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. కారులో వెనుక సీట్ల వరుసలోని మధ్య సీటుకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కారులో ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులకు త్రీ—పాయింట్ సీటు బెల్టులు కార్ల తయారీ కంపెనీలు సమకూర్చడాన్ని తప్పనిసరి చేసే ఫైలుపై బుధవారమే సంతకం చేసినట్లు గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో తయారయ్యే అత్యధిక కార్లలో మొదటి సీట్లు, రెండు వెనుక సీట్లకు త్రీ–పాయింట్ సీటు బెల్టుల ఏర్పాటు ఉంది. కాగా..ఈ కార్లలో వెనుక వరుసలోని మధ్య సీటుకు విమాన సీట్లకు ఉన్నట్లుగా టూ–పాయింట్ లేదా ల్యాప్ సీటు బెల్ట్ సౌకర్యం ఉంది. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా దాదాపు 1.5 లక్షల మంది మరణిస్తున్నారని గడ్కరీ వివరించారు.