లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులతో సహా 8 మంది మరణానికి కారణమైన కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వీడియా కాన్ఫరెన్సింగ్ ద్వారా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ జనవరి 18న తన తీర్పును రిజర్వ్ చేసింది. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ రాజీవ్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తన క్లయింట్ నిరపరాధని, రైతులపై దూసుకెళ్లిన కారులో తన క్లయింట్ ఉన్నారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఆశిష్ మిశ్రా తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనను అదనపు అడ్వకేట్ జనరల్ వికె షాహి తోసిపుచ్చుతూ లఖింపూర్ ఖేరీ ఠన సమయంలో కారులోనే ఆశిష్ మిశ్రా ఉన్నారని వాదించారు. గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మరణించారు.