Saturday, November 23, 2024

ప్రధాని మోడీపై సభాహక్కుల నోటీసు

- Advertisement -
- Advertisement -
Notice of assembly rights against PM Modi
సమావేశాల బహిష్కరణకు టిఆర్‌ఎస్ నిర్ణయం
పార్లమెంట్ ఉభయసభల్లోనూ సమర్పణ, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ అవతరణపై మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టిఆర్‌ఎస్ ఎంపిలు
పార్లమెంట్‌లో ఆందోళన ఉధృతి, నిరసనలతో దద్దరిల్లిన ఉభయసభలు
పార్లమెంట్‌ను సభాపతులను అగౌరవపరుస్తూ ప్రధాని మాట్లాడారని విమర్శ
గురువారం ఉదయం రాజ్యసభ చైర్మన్‌ను కలిసి మోడీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన కెకె, జోగినపల్లి సంతోష్‌కుమార్, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్
సాయంత్రం లోక్‌సభ స్పీకర్‌కు నోటీసులు అందజేసిన టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు నామా, ఇతర ఎంపిలు బీబీపాటిల్, పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బి.రంజిత్‌రెడ్డి, బి.వెంకటేశ్
రాజ్యసభ నుంచి వాకౌట్, మద్దతు తెలిపిన కాంగ్రెస్, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
ప్రధాని మోడీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు అందజేస్తున్న ఎంపిలు కెకె, జోగినపల్లి, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్
ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసును లోక్‌సభలో అందజేస్తున్న ఎంపిలు నామా, బిబి పాటిల్, పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జి.రంజిత్‌రెడ్డి, బి.వెంకటేశ్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన నరేంద్రమోడీపై టిఆర్‌ఎస్ పార్టీ సభా హక్కుల నోటీసును గురిపెట్టింది. తెలంగాణ ఏర్పాటుపై మోడీ చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఆందోళనను మరింత ఉధృతం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఆమోదించిన విషయంలో పార్లమెంటును, సభాపతిని అవమానపరిచేలా ప్రధాని మాట్లాడారని టిఆర్‌ఎస్ ఎంపిలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గురువారం ఉభయ (రాజ్యసభ, లోక్‌సభ) సభల్లోనూ ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్, సభాపతులను అగౌరవపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు చేశారన్నారు.సభాహక్కుల ఉల్లంఘన కింద మోడీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయం రాజ్యసభ చైర్మన్‌ను కలిసి టిఆర్‌ఎస్ ఎంపిలు నోటీసు ఇచ్చారు. 187వ నిబంధన కింద రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పార్టీ ఎంపిలు కె.కేశవరావు (కెకె), జోగినపల్లి సంతోష్‌కుమార్, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్ కలిసి నోటీసు అందజేశారు. కాగా సాయంత్రం లోక్‌సభ స్పీకర్‌కు టిఆర్‌ఎస్ ఎంపిలు రూల్ 222 కింద నోటీసులు అందజేశారు.

లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపిలు బిబి పాటిల్, పి. రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జి. రంజిత్‌రెడ్డి, బి. వెంకటేశ్‌నేతలు మోడీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. 2014లో లోక్‌సభలో ఆమోదం పొందిన ఎపి రీ ఆర్గనైజేషన్ బిల్లుపై నరేంద్రమోడీ అత్యంత అవమనకరమైన రీతిలో మాట్లాడారన్నారు. ఈ వ్యాఖ్యలు ఉన్నతమైన చట్ట సభలను కించపరిచే విధంగా ఉన్నాయని సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల్లో టిఆర్‌ఎస్ ఎంపిలు పేర్కొన్నారు. ఇది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కూడా అవమాని పరిచినట్లేనని వారు తెలిపారు. మోడీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సభా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తాము ఇచ్చిన నోటీసులపై ఉభయ సభల్లో చర్చకు అనుమతి ఇవ్వాలని రాజ్యసభ చైర్మన్‌కు, లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఉభయ సభల్లో సభా ఉల్లంఘన నోటీసులపై చర్చ జరిగేంత వరకు తాము సభలకు హాజరయ్యేది లేదని కూడా టిఆర్‌ఎస్ ఎంపిలు ఖరాఖండిగా స్పష్టం చేశారు.

ఆందోళన ఉధృతం….ఉభయ సభలను స్థంభింప చేసిన టిఆర్‌ఎస్

మోడీపై టిఆర్‌ఎస్ పార్టీ ఆందోళనను మరింత ఉధృతం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో మోడీ చేసిన ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు రోజుల క్రితం రాష్ట వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేసిన విషయం తెలిసింది. కాగా ఇదే అంశంపై మోడీ సర్కార్‌కు ఊపిరాడనివ్వకుండా గులాబీ బాస్, ముఖ్యమంత్రి కెసిఆర్ తనదైన శైలిలో వ్యూహాలను రూపొందించారు. ఇందులో భాగంగానే పార్లమెంట్‌లో మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టిఆర్‌ఎస్ పార్టీ అందజేసింది. దీనిపై చర్చకు పట్టుబడుతూ ఉభయ సభల్లో టిఆర్‌ఎస్ ఎంపిలు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. సభా కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకున్నారు. రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కాగానే టిఆర్‌ఎస్ ఎంపీలు మోడీ చేసిన వ్యాఖ్యలు చట్ట సభలను కించ పరిచే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు నిరసనగా రాజ్యసభలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దీనిపై ఉభయ సభల్లో నిర్ణయం తీసుకునేంత వరకు సభలకు హాజరుఅయ్యేది లేదంటూ పార్టీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.

 

రాజ్యసభ నుంచి వాకౌట్

తెలంగాణ బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సభలో నిలబడి ఎంపీలు నిరసన తెలిపారు. ఇందుకు నిరసనగా ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు కేశవరావు రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ విషయంపై టిఆర్‌ఎస్, బిజెపి సభ్యుల మధ్య వాగ్వివాదం జరుగుతున్న సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ జోక్యం చేసుకున్నారు. ఇరుపార్టీలకు చెందిన సభ్యులను వారించారు. సభలో గొడవ చేయడం తగదన్నారు. నోటీసును ఛైర్మన్ పరిశీలనకు పంపామని సంయమనం పాటించాలని సూచించారు. అయితే టిఆర్‌ఎస్ ఎంపీలు మాత్రం ముందుగా ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబచ్చారు. ఇందుకు డిప్యూటీ చైర్మన్ అంగీకరించకపోవడంతో వారు సభ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం కెకే మాట్లాడుతూ, ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని, పార్లమెంట్ పద్ధతులను మంటగలిపే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. పార్లమెంట్ పద్ధతుల గురించి తెలిసినవారు ఎవరూ కూడా ఇలా మాట్లాడబోరని అన్నారు. పార్లమెంట్లో జరిగే దేనినీ కోర్టు కూడా ప్రశ్నించడానికి వీలుండదని అన్నారు. ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పైగా పార్లమెంట్ లో శాస్త్రీయం, ఆశాస్త్రీయం అంటూ ఏమీ ఉండదన్నారు. మెజారిటీ ఉందా? లేదా?అన్నది చూసి బిల్ పాస్ చేస్తుంటారన్నారు.

మద్దతు తెలిపిన కాంగ్రెస్

రాజ్యసభలో టిఆర్‌ఎస్ ఎంపిల పోరాటానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే మాట్లాడుతూ…. టిఆర్‌ఎస్ ఎంపిల డిమాండ్ పూర్తిగా న్యాయమైందన్నారు. ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యాలను తాను ఖండిస్తున్నట్లు ఖార్గే పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన ఎనిమిదేళ్ల కిందట రెండు సభల్లో పాసైన బిల్లుపై ప్రధాని కామెంట్ చేయడం శోచనీయమన్నారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంపిల నిరసన

ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన అనంతరం టిఆర్‌ఎస్ ఎంపిలు తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోడీ డౌన్…డౌన్ ంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెంటనే తెలంగాణ ప్రజలకు ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు, బడుగు లింగయ్యయాదవ్, పి. రాములు, మన్నే శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్‌నేత, రంజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News