Monday, December 23, 2024

ఎసిబి వలలో సర్పంచ్

- Advertisement -
- Advertisement -
Medchal Sarpanch in the ACB trap
భవన నిర్మాణ అనుమతులకు రూ.5లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడ్చల్‌లోని పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్

మన తెలంగాణ/మేడ్చల్: జిల్లా కేంద్రమైన మేడ్చల్‌లోని పూడూర్ గ్రామ సర్పంచ్ ఈటబోయిన బాబు యాదవ్ భవన నిర్మాణ అనుమతుల కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం ఎసిబి అధికారులకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూర్ గ్రామంలోని సర్వే నంబర్ 312లో సాంగి శ్రీనివాస్‌రావు అనే వ్యక్తి 3 ఎకరాల 35 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, దరఖాస్తు చేసుకున్న 15రోజులకు గ్రామ కార్యదర్శి ఇంద్రజ అనుమతిని నిరాకరించారు. దీంతో శ్రీనివాస్‌రావు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా.. సర్పంచ్ బాబుయాదవ్‌ను కలవమని కార్యదర్శి చెప్పడంతో.. పర్మిషన్ కోసం రూ.10లక్షలు ఇవ్వాలని సర్పంచ్ డిమాండ్ చేశాడు.

అంత ఇవ్వలేనని శ్రీనివాస్ వేడుకోగా.. రూ.9లక్షలిస్తే పర్మిషన్ ఇస్తామని తేల్చిచెప్పాడు. ముందుగా రూ.5లక్షలు ఇచ్చేలా, నెల రోజుల్లోగా మిగతా రూ.4లక్షలు ఇవ్వాలని షరతు పెట్టారు. దీంతో శ్రీనివాస్‌రావు ఎసిబిని ఆశ్రయించారు. ఎసిబి అధికారుల సూచన మేరకు గురువారం డబ్బులను ఇచ్చేందుకు సర్పంచ్ బాబుయాదవ్‌ను శామీర్‌పేట మండల పరిధిలోని ఊర్జిత లే అవుట్‌లో శ్రీనివాస్‌రావు కలిసి రూ.5లక్షలు అందజేస్తుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం సర్పంచ్‌ను మేడ్చల్ తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ జరిపారు. శుక్రవారం ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఎసిబి డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News