అన్ని సమన్వయంతో పనిచేయాలి
అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్‌కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం జాతరకు హాజరయ్యే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ సోమేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డిలు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పోలీసు, రెవెన్యూ, గిరిజన, దేవాదాయ, వైద్య ఆరోగ్య మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా, విద్యుత్, పశుసంవర్ధక శాఖ, రోడ్లు భవనాలు, నీటి పారుదల, ఆర్టీసి తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతర ఈనెల 16వ తేదీ నుంచి 19 వరకు కొనసాగుతుందని సిఎస్ తెలిపారు. ఈసారి కూడా కోటిమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జంపన్నవాగులోకి నీరు విడుదల చేశామని, ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయని సిఎస్ తెలిపారు.
3,850 బస్సులు….21 లక్షల మంది ప్రయాణికులు…
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. మేడారం పూజారులు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలిసి పనిచేయాలని సిఎస్ సూచించారు. జాతరకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసి ద్వారా 3,850 బస్సులు నడిపి 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ వివరించారు. మేడారంలోని ప్రధాన ఆస్పత్రి ఏర్పాటుతో పాటు మరో 35 హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్‌సేప్టీ అధికారులను నియమించాలన్నారు. రవాణా సాఫీగా జరిగేందుకు రోడ్లు, భవనాల శాఖ ద్వారా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తయినట్టు ఆయన తెలిపారు. 327 లోకేషన్‌లో 6700 టాయిలెట్ల నిర్మాణం చేశామన్నారు. వాటితో పాటు స్నానఘట్టాలు కూడా నిర్మించినట్టు ఆయన పేర్కొన్నారు.
శానిటేషన్ పర్యవేక్షణకు 19 జిల్లాల పంచాయతీరాజ్ అధికారులు
జాతర సందర్భంగా అంటువ్యాధులు, నీటి కాలుష్యం కాకుండా ఉండేందుకు నిరంతరం క్లోరినేషన్ నిర్వహిస్తున్నారన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అదనపు సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. జాతరలో 18 ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లల క్యాంపుల ఏర్పాటు చేసినట్టు సిఎస్ తెలిపారు. శానిటేషన్ పర్యవేక్షణకై 19 జిల్లాల పంచాయతీ రాజ్ అధికారులను నియమించామన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి 5 వేల మంది సిబ్బందిని ఇక్కడ నియమించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు.