ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది. అక్కడి అమెరికన్ దౌత్య సిబ్బంది దేశం విడిచి రావాలంటూ విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తమ దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు స్వదేశానికి చేరుకోవాలని ఆదేశించిన అగ్రరాజ్యం.. సిబ్బంది విషయంలో మాత్రం వారి ఇష్టానికి వదిలేసింది. కానీ తాజాగా వారినీ రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కొంతమంది దౌత్యవేత్తలను తమ మిత్ర దేశమైన పోలాండ్ సరిహద్దు మార్చే అవకాశమున్నట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. మరో వైపు ఇటీవల పోలాండ్‌కు 1700మంది సైనికులను తరలించిన అమెరికా .. తాజాగా మరో 3000 మంది సైనికులను పంపనున్నట్లు ప్రకటించింది.
నాటో బలగాలకు శిక్షణ అందించడమే వారి లక్షమని, ఉక్రెయిన్‌లో ప్రవేశించడం కాదని తెలిపింది. ఉక్రెయిన్‌లోని అమెరికా ప్రజలంతా వీలయినంత త్వరగా ఆ దేశం విడిచి రావాలని అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటతోనీ బ్లింకెన్ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది సేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. మరో వైపు జర్మనీలోని వెయ్యి మంది అమెరికా సైనికులు నాటోకు మద్దతుగా రొమేనియాకు వెళ్లనున్నారు. వీరు కాక 18వ ఎయిర్‌బోర్న్ కార్ప్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన 300 మంది సైనికులు లెఫ్టెనెంట్ జనరల్ మైఖేల్ ఇ. కుర్నిల్లా నేతృత్వంలో జర్మనీకి చేరుకున్నారు. ఇదిలా ఉండగా .. తాజాగా న్యూజిలాండ్ సైతం అమెరికా బాట పట్టింది. తమ దేశవాసులు వెంటనే ఉక్రెయిన్ విడిచి వెళ్లాలని ఆ దేశ విదేశాంగ శాఖ శనివారం విజ్ఞప్తి చేసింది.