Monday, December 23, 2024

విభజన చట్టం సమస్యలపై 17న త్రిసభ్య కమిటీ పరోక్ష భేటీ

- Advertisement -
- Advertisement -

High level committee to resolve AP TS division disputes

కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ఎజెండా నుంచి ఎపి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
చర్చ ఐదు అంశాలకే పరిమితం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపు నుంచి ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్‌లు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు ఉన్నతస్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈనెల 17వ తేదీన వర్చువల్‌గా వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముందుగా తొమ్మిది అంశాలపైన చర్చించాలని శనివారం ఉదయం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న కేంద్ర హోంశాఖ సాయంత్రానికి ఆ ఉత్తర్వులను సవరించుకొని అయిదు అంశాలకు కుదించింది. ఏపీకి ప్రత్యేకహోదాను ఇచ్చే అంశంపై చ్చించాలని శనివారం ఉదయం జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్ర హోంశాఖ పేర్క్నొడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యింది. తీవ్ర వివాదాస్పదం కూడా అయ్యింది. సోషల్ మీడియా వేదికగా చర్చోపచర్చలు జరిగాయి.

వైఎస్‌ఆర్‌సి పార్టీ అయితే ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మొత్తం క్రెడిట్‌ను ఇస్తూ సోషల్ మీడియాలో స్టోరీలు నడిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అయితే ఏకంగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి తమ నేత జగన్ చేసిన కృషి వల్లనే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అంశంపై ఎజెండాలో పెట్టిందని ఆకాశానికి ఎత్తేశారు. ఇలా రాజకీయంగా తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. చివరకు బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు స్పందించారు. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా అంశం లేనేలేదని, కాకుండా ఉదయం ఇచ్చిన ఉత్తర్వుల్లో పొరపాటు జరిగిందని, అది సరిదిద్దటం జరుగుతుందని చెప్పడం, సాయంత్రానికి ఉత్తర్వుల్లో మార్పులు చేస్తూ తొమ్మిది అంశాలను కుదించి అయిదు అంశాలపైనే త్రిసభ్య కమిటీ చర్చించేటట్లుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చే అంశాన్ని తొలగించింది. ఈనెల 17వ తేదీన త్రిసభ్య కమిటీ చర్చించబోయే అంశాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (ఎస్.ఎఫ్.సి) విభజన, ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలపైన చర్చించనున్నారు.

అదే విధంగా పన్నుల విధానంలో నెలకొన్న వివాదాలను తొలగించడం, బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న నిధులను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, ఏపీ ఎస్.సి.ఎస్.సి.ఎల్, టీ.ఎస్.సి.ఎస్.సి.ఎల్ మధ్య రుణాల పంపణీపైన చర్చలు జరుపుతారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కట్టబెట్టేది లేదని తేలిపోయింది.

ప్రధాన నమస్యల జోలికివెళ్ళని కేంద్ర హోంశాఖ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రధాన వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకుండా తప్పించుకునేందుకు కేంద్ర హోంశాఖ ఎజెండాను ఖరారు చేసిందని తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఏటా వేసవిలో, ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కృష్ణా, గోదావరి నదుల నీటిని వినియోగించుకునే సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న గొడవలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సరైనా మార్గదర్శకాలు జారీ చేసేందుకు వీలుగా ఈ త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చనీయాంశంగా చేర్చకపోవడాన్ని ఆ అధికారులు ఆక్షేపిస్తున్నారు. నదీ జలాల వివాదాలను పరిష్కరించడానికి కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని, కేంద్ర జల్‌శక్తి మంత్రిని కూడా సీఎం కేసిఆర్ అనేకసార్లు కోరారు. ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన కేంద్రం ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు.

కనీసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటయ్యి, కృష్ణా నదీ జలాలపై అధ్యయనం చేసి నాలుగు భాగస్వామ్య రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేసేంత వరకూ అనేక సంవత్సరాల సమయం పడుతుందని, కనీసం అప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలు జరుగకుండా తగిన నియమ, నిబంధనలు, మార్గదర్శకాలను జారీ చేయాలని కూడా ఈ త్రిసభ్య కమిటీకి ఒక అంశంగా బాధ్యతను అప్పగించకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం పట్ల ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్ధంచేసుకోవాలని ఆ ఉన్నతాధికారులు ఎద్దేవా చేస్తున్నారు. అంతేగాక 9వ షెడ్యూలు, 10వ షెడ్యూలులోని సంస్థలకు చెందిన ఆస్తులు, వాటి నిధుల పంపకాలపైన కూడా వివాదాలు ఉన్నందున ఆ అంశాన్ని చేర్చినట్లే చేర్చి మళ్ళీ తొలగించడం ఆశ్చర్యంగా ఉందని ఆ సీనియర్ అధికారులు అంటున్నారు. విద్యుత్తు బకాయిల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల వాదనలు విభిన్నంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఎజెండాలో చేర్చినప్పటికీ ఈ సమస్య పరిష్కారమవుతుందా? లేదా? అనేది చర్చగా మారింది.

ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేమో తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి ఏపీ 6,015 కోట్ల రూపాయల బకాయిలు రావాలని లెక్కలు చెబుతుండగా, తెలంగాణ కూడా ఏపీ నుంచి తమకు సుమారు 5,400 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందని డిమాండ్ చేస్తోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలూ విద్యుత్తు బకాయిలపై ఎవ్వరి లెక్కలు వారు చెబుతున్నారు. దీనికితోడు స్పెషల్ గ్రాంట్ కింద 723 కోట్లు విడుదలయ్యాయని, ఈ నిధుల్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నిధుల లెక్కలు తేల్చలేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్ళిందని, ఈ అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చలేదని, అంతేగాక రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో కేంద్ర ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళించిందని, ఇది ముమ్మాటికీ కేంద్రం చేసిన తప్పిదమేనని ఈ అంశం కూడా చర్చకు రావాలి కదా& దాన్ని ఎందుకు చేర్చలేదని కూడా ఆ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ఆ మొత్తం సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా త్రిసభ్య కమిటీకి ఎజెండా ఇచ్చినట్లయితే బాగుండేదని ఆ అధికారులు అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News