జవాన్లను తప్పుబట్టడమంటే అమ్మను అవమానించడమే
రాహుల్‌గాంధీపై వ్యాఖ్యలను సమర్థించుకున్న హిమంత బిశ్వశర్మ
గౌహతి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. తన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఆర్మీ సిబ్బంది గురించి ప్రశ్నించడాన్ని తాను ఎంతమాత్రం సహించబోనంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరస ట్వీట్లు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్,సిడిఎస్ బిపిన్ రావత్‌నుద్దేశించి గతంలో కాంగ్రెస్ నేతలతో చేసిన వ్యాఖ్యలతో కూడిన వార్తా క్లిపింగ్‌లను జత చేశారు.‘ ఆర్మీ వైపు నిలబడడం నేరమా? అయినా ఆర్మీ సిబ్బంది దేశభక్తిని శంకించడానికి వీల్లేదు. దేశం కోసం వారు చేసే సేవల గురించి రుజువులు అడగడం సమంజసం కాదు. దేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే కాదు. భారత్ మన అమ్మ. మన జవాన్లను తప్పుబట్టడం అంటే మన అమ్మను మనం అవమానించడమే’ అంటూ హిమంత రాసుకొచ్చారు. బిపిన్ రావత్‌ను అవమానించడానికి, కించపర్చడానికి ఉన్న ఏ అవకాశాన్నీ కాంగ్రెస్ పార్టీ వదులుకోలేదని ఆరోపించారు. రావత్ సిడిఎస్‌గా నియమితులైనప్పుడు కూడా ఆయనకున్న అర్హతలేమిటని కాంగ్రెస్ ప్రశ్నించిందన్నారు.
సైనికుల తరఫున అలా మాట్లాడడాన్ని ప్రశ్నించినందుకే ఈ రోజు వాళ్లు తనపై కోపంగా ఉన్నారంటూ హిమంతభిశ్వశర్మ వ్యాఖ్యానించారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీపై హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి రాహుల్ ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు.ఈ క్రమంలో రాహుల్ పుట్టుక గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తామేమైనా ఆధారాలు అడిగామా అని ఎదురు ప్రశ్నించారు. దీనిపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర పార్టీల నేతలు కూడా హిమంత వ్యాఖ్యలను తప్పుబట్టారు. హిమంతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు కూడా.