Saturday, November 23, 2024

ఐటిలో లేరు సాటి

- Advertisement -
- Advertisement -

Minister KTR laid foundation stone for Genpact in Uppal

ఈ రంగంలో దేశానికే రాజధాని తెలంగాణ
ఉప్పల్‌లో జెన్ ప్యాక్ట్ విస్తరణకు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి రంగంలో దేశానికే రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ రంగంలో మన రాష్ట్రం గణనీయమనై ప్రగతిని సాధిస్తోందన్నారు. ఇందులో ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి చెందినంతగా మరే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడం లేదన్నారు. కనీసం మన రాష్ట్ర దరిదాపుల్లో కూడా లేవన్నారు. అంతగా ఐటి రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ అభివృద్ధిని కేవలం ఒక ప్రాంతానికే కాకుండా నగరం నలుమూలాల విస్తరింప చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తూర్పు హైదరాబాద్‌లోనూ లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం ఉప్పల్లో ప్రముఖ ఐటి సంస్థ అయిన జెన్‌ప్యాక్ట్ విస్తరణ పనులను మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ఐటి బాగా విస్తరించిందన్నారు.

జెన్‌ప్యాక్ట్ సంస్థ నగరం నలుదిక్కుల 20 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. కేవలం నగర శివారులోనే కాకుండా ఈ కంపెనీ వరంగల్లో కూడా పెట్టుబడులు పెట్టడం కూడా శుభపరిణామని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐటి రంగం పరుగులు తీస్తోందన్నారు. ప్రధానంగా ఉప్పల్ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతోందన్నారు. కొత్త ఎలివేటెడ్ కారిడార్, స్కై వాక్ లాంటివన్నీ నిర్మాణం జరుగుతోందన్నారు. మెట్రో కనెక్టివిటీ కూడా ఉందన్నారు. అందువల్ల ప్రజా రవాణా సులువుగా ఉంటుందన్నారు.

తూర్పు హైదరాబాద్ అభివృద్ధి కోసం నాగోల్లో శిల్పారామం ఏర్పాటు చేశామన్నారు. ఉప్పల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉందన్నారు. కోవిడ్ తర్వాత మళ్ళీ క్రికెట్ ప్రారంభం అవుతుందన్నారు. అలాగే ఉప్పల్ నుంచి నారాపల్లి దాకా స్కైవే నిర్మాణం జరుగుతోందన్నారు. అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జనంతో కళకళ లాడుతుందన్నారు. సెక్యూరిటీ పరంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే నగరంలో ఐటి పార్కుల నిర్మాణానికి డెవలపర్లు కూడా ముందుకొస్తున్నారని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందన్నారు. జెన్‌ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే తూర్పు హైదరాబాద్లో లక్ష ఉద్యోగాల లక్ష్యానికి సమీపిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జెన్‌ప్యాక్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News