లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం మహా ఊపుతో రాబోతోందని, తొలివిడత పోలింగ్, రెండో విడత ఓటింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. కాన్పూరులో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర సత్వర అభివృద్ది కోసం ప్రతికులం, వర్గం, సమైక్యంగా ఓటు వేస్తున్నారన్నారు. తనను దీవించేందుకు ముస్లిం సోదరీమణులు నెమ్మదిగా ఇళ్ల నుంచి బయల్దేరుతున్నారని చెప్పారు. బీజేపీ జయకేతనాన్ని మన తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలు తమంతట తామే ఎగురవేస్తున్నారన్నారు. మాఫియా తిరిగి పుంజుకోవడం కోసం సమాజ్‌వాదీ పార్టీకి, అఖిలేశ్ యాదవ్‌కు మద్దతిస్తోందని, ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో వంశపారంపర్యంగా కుటుంబ పాలన జరిగినప్పుడు రేషన్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పేదలకు ఆహార ధాన్యాలు దక్కలేదన్నారు. లక్షలాది నకిలీ రేషన్ కార్డులను సృష్టించారన్నారు. డబుల్ ఇంజిన్ (మోడీ, యోగీ) ప్రభుత్వం ఈ నకిలీ రేషన్ కార్డు స్కీమ్‌కు తెరదించిందన్నారు. నేడు కోట్లాది మంది ఉత్తరప్రదేశ్ ప్రజలు ఉచితంగా రేషన్ సరకులను పొందుతున్నారని చెప్పారు. పేదతల్లులు, సోదరీమణుల స్టవ్‌లు ఇకపై ఆరిపోబోవని తెలిపారు. చిన్నకారు రైతుల సంక్షేమం గురించి కేవలం బీజేపీ మాత్రమే ఆందోళన చెందుతుందని, ఈ రైతుల కోసం తాము పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించామన్నారు. ప్రతిరైతు బ్యాంకు ఖాతాకు నేరుగా సొమ్ము పంపిస్తున్నామని చెప్పారు.
PM Modi Addressed at Election Campaign in UP