Monday, November 25, 2024

పశ్చిమబెంగాల్ 4 మున్సిపల్ కార్పొరేషన్లలో టిఎంసి క్లీన్‌స్వీప్

- Advertisement -
- Advertisement -

TMC clean sweep in 4 municipal corporations in West Bengal

ప్రజలకు సిఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు

కోల్‌కతా : తొమ్మిది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ( టిఎంసి) ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి విజయభేరీ మోగించింది. ఈనెల 12 న నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా ఆ నాలుగింటినీ టిఎంసి గెల్చుకుని క్లీన్‌స్వీప్ చేసింది. సిలిగురి, అసాన్‌సోల్, బిధాన్‌నగర్, చందన్‌నగర్, మున్సిపాలీటీల్లో టిఎంసి తమ స్థానాలను తిరిగి దక్కించుకోగా, సిపిఎం నాయకత్వం లోని వామపక్షం స్థానమైన సిలుగురిని కూడా దక్కించుకోగలిగింది. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, బిధాన్ నగరలోని 41 సీట్లలో 39 సీట్లను టిఎంసి గెల్చుకుంది. విపక్ష బీజేపీ , సిపిఐ ఖాతా కూడా తెరవలేదు. కాంగ్రెస్ ఒక సీటు గెల్చుకోగా, మరో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. బిధాన్‌నగర్‌లో మొత్తం ఓట్లలో టిఎంసికి 95.5 శాతం ఓట్లను సాధించుకుంది. కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఒక్కొక్కరు 2.44 శాతం ఓట్లను పొందగలిగారు. చందన్‌నగర్‌లోని 32 వార్డుల్లో టిఎంసికి 31 వచ్చాయి. సిపిఎంకు ఒక్కటే దక్కింది.

ఈ రెండు పార్టీల ఓట్ల శాతం 96.88 శాతం కాగా, సిపిఎంకు 3.13 శాతం ఓట్లు వచ్చాయి. సిపిఎం నాయకత్వం లోని లెఫ్ట్‌ప్రంట్ కోటగా ఉన్న సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 47 వార్డుల్లో టిఎంసి 37 వార్డులను కైవసం చేసుకోగా, బిజెపి ఐదు వార్డులను దక్కించుకుని విపక్ష స్థానం సాధించింది. లెఫ్ట్ ఫ్రంట్ కేవలం నాలుగు వార్డులే గెలుచుకుని మూడోస్థానానికి దిగజారింది. సిలుగురిలో టిఎంసి ఓట్ల శాతం 78.72 శాతం కాగా, బిజెపి 10.64 శాతం , సిపిఎం 8.5 శాతం ఓట్లను పొందగలిగాయి. ఇక్కడ మేయర్‌గా ఉన్న అశోక్‌భట్టాచార్య, బిజెపి ఎమ్‌ఎల్‌ఎ శంకర్‌ఘోష్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 3000 ఓట్ల తేడాతో గెలిచిన టిఎంసి నేత గౌతమ్‌దేవ్ సిలుగురి తదుపరి మేయర్ అవుతారని సిఎం మమతాబెనర్జీ ప్రకటించారు. అసాన్‌సోల్‌లో మొత్తం 106 స్థానాలకు గాను 91 టిఎంసి విజయపతాకం ఎగురవేసింది. మరో ఐదు వార్డుల్లో ఆధిక్యతతో ఉంది. బిజెపి ఏడు వార్డుల్లో,సిపిఎం, కాంగ్రెస్ క్రమంగా రెండు, మూడు వార్డులు దక్కించుకున్నాయి.

ఈ పారిశ్రామిక నగరంలో టిఎంసి ఇంతవరకు మొత్తం ఓట్లలో 64. 71 శాతం ఓట్లను సాధించుకోగా, బిజెపి 4.91 శాతం, సిపిఎం 1.96 శాతం ఓట్లను పొందగలిగాయి. అసాన్‌సోల్ 31 వ వార్డులో ఫలితాలు సమానంగా రావడంతో లాటరీలో టిఎంసి అభ్యర్థి ఆషాప్రసాద్‌ను విజేతగా ప్రకటించారు. ఇది మరోసారి మా, మట్టి, మనుష్ అన్న నినాదానికి ఇది విజయమని సిఎం మమతాబెనర్జీ ఉద్వేగంగా ఉన్నారు. తృణమూల్‌పై విశ్వాసంతో గెలిపించినందుకు నాలుగు కార్పొరేషన్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. ఏ విజయమైనా తమ నిర్ణయాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మరింత సేవ చేసేలా ప్రోత్సహిస్తుందని తాను నమ్ముతున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్ష బిజెపి మాత్రం అప్రజాస్వామిక విధానాలు, బెదిరింపుల వల్లనే ఈ విజయం లభించిందని ఆరోపించింది. ఎన్నికల పోలింగ్ రోజున ఎన్ని ఓట్లు లూటీ అయ్యాయో అందరికీ తెలిసిందేనని ఆరోపించింది. ఈ ఫలితం ప్రజాతీర్పును ప్రతిబింబించదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ఘోష్ వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News