రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సెక్యులర్ నాయకుడు అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఆన్నారు. ఈక్రమంలో ఈనెల 17న సిఎం కెసిఆర్ జన్మదినోత్సవం సంధర్భంగా నగరంలోని మొగల్‌పూరలోని జామియా ఆల్ మోమినత్ విద్యా సంస్థలో మంగళవారం నాడు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు లౌకిక నాయకుడని, తెలంగాణ ఉద్యమం విజయవంతం చేసి సెక్యులరిజం కాపాడేందుకు కృషి చేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. సిఎం నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 10 వేల మంది మసీదులలో ఇమామ్‌లకు ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు అందజేస్తున్నారని, అలాగే లక్ష మంది విద్యార్థులకు వసతి, భోజనంతో ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా ముస్లిం యువతుల వివాహం కోసం లక్ష రూపాయలు అందజేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో జామియా అల్-మోమినాత్ వ్యవస్థాపకుడు ముఫ్తీ మస్తాన్ అలీ ఖాద్రీ, హఫీజ్ మహ్మద్ ముజఫర్ హుస్సేన్ ఖాన్, నవాజీ, ఖయ్యూమ్ అన్వర్ న్యూస్ ఎడిటర్ తదితరులు పాల్గొన్నారు.