విష్ణు విశాల్ హీరోగా నటించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎఫ్‌ఐఆర్’. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. మాస్ మహరాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు సక్సెస్ కేక్‌ను కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్ మాట్లాడుతూ “ఎఫ్‌ఐఆర్ చిత్రానికి తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చి విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో కూడా ఆదరణ పొందుతోంది.
అయితే ఈ చిత్రం పోస్టర్‌ను చూసి కొంతమంది ముస్లిం సోదరులు సినిమాను వివాదస్పదమైనదిగా భావించారు. వారికి క్షమాపణలు చెబుతున్నాం. సినిమా చూస్తే వారికి నిజమేంటో అర్థమవుతుంది. ఇక రవితేజ బ్యానర్ ఆర్‌టి టీమ్ వర్క్‌తో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెలుగు, తమిళంలో ఓ సినిమాను నిర్మించబోతోంది. ఆ వివరాలను త్వరలో ప్రకటిస్తాం”అని అన్నారు. దర్శకుడు మను ఆనంద్ మాట్లాడుతూ నా తొలి సినిమా తెలుగులోనూ విడుదల కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభిషేక్ పిక్చర్స్ సిఈఓ వాసు, రెబ్బా మోనిక, స్రవంతి పాల్గొన్నారు.